పుట:మార్కండేయపురాణము (మారన).pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

అతినియమవ్రతనిష్ఠా, న్వితుఁ డై దారుణతపంబు విడువక చేసె
న్ధృతియుతుఁడు రుచి ప్రభుఁ డా, శతధృతి మతి నిలిపి దివ్యశతవర్షంబుల్.

23

తపఃప్రసన్నుఁ డైనబ్రహ్మవలన రుచి యిష్టార్థములఁ బడయుట

వ.

అంత లోకపితామహుండైన బ్రహ్మదేవుండు ప్రత్యక్షం బై భవదీప్సితం బెయ్యది
యెఱిఁగింపు మనిన నతండు ప్రణమిల్లి పితృవచనంబునఁ దనచేయం దలంచిన
కార్యంబు విన్నవించిన విని విరించి రుచి నాలోకించి నీవు ప్రజాపతిత్వంబు నంగీ
కరించి సకలప్రజలం బుత్రుల నుత్పాదింపుము నిఖిలకర్మకలాపంబు నిర్వర్తించి
కృతాధికారత్వంబు భజించి తుదిం బరమసిద్ధిం బొందుము పితృవాక్యంబు తప్పక
దారపరిగ్రహం బొనరింపుము నీకుం గన్యాలాభంబును బితృప్రసాదంబున సిద్ధించు
నత్యంతనియతిం బితృపూజనంబు గావించి పితరులం బ్రార్థింపు మనిన నమ్మహాత్ముం
డట్ల కాక యని యొక్కమహానదియందు వివిక్తం బగుపులినతలంబున వసియించి
పితృదేవతలకు మ్రొక్కి తర్పణంబు చేసి వివిధస్తవనంబులఁ బితృదేవతల నిట్లు
స్తుతింపం దొడంగె.

24

రుచి దేవతల స్తుతించుట

క.

దేవతలును మునులును నా, నావిధపూజనము లొగి నొనర్పఁగ శ్రాద్ధ
శ్రీవిభవాన్వితు లగుపితృ, దేవతలకు మ్రొక్కెదం బ్రదీపితభక్తిన్.

25


చ.

అరుదుగ భుక్తిముక్తులకు నఱ్ఱులు సాఁచుచు సిద్ధసాధ్యకిం
పురుషవియచ్చరు ల్నరులు భూసురభూవరవైశ్యశూద్రు లా
దరమున శ్రాద్ధకాలమునఁ దప్పక పూజలు ప్రీతితోడ నె
వ్వరికి నొనర్తు రట్టిపితృవర్యుల కే నతిభక్తి మ్రొక్కెదన్.

26


ఆ.

తిలల గంధపుష్పముల ధూపదీపోప, హారముల నిరంతరాతిభక్తి
భుజగదనుజవరులు పూజింప నొప్పారు, పితృగణంబులకు వినతి యొనర్తు.

27


క.

అమరత్వమును నింద్ర, త్వమునుం బ్రహ్మత్వమును ముదంబును బహుకా
మములు దయ నొసఁగుపితృవ, ర్గమునకు వందన మొనర్తుఁ బ్రకటితభక్తిన్.

28


సీ.

వెలుఁగుహుతాగ్నిలో వేల్చుహవిస్సుల నెవ్వరి కగుఁ దృప్తి యెవ్వ రెపుడు
విప్రదేహస్థు లై వేడ్క భుజింతు రెవ్వరు పిండవిధిఁ బ్రీతిభరితు లగుదు
రెలమి నెవ్వరు కృష్ణతిలలను ఖడ్గమాంసములను బరమహర్షము వహింతు
రెవ్వరు తగుకాల మెడపక యిడుకాల శాకసంసేవ నుత్సవము దాల్తు


తే.

రెవ్వ రర్థి వహింతు రహీనధవళ, తరవిమానములందు సంతతవిభూతి
నట్టి పితృవరు లన్నతోయములఁ దృప్తి, కలితు లగుచుఁ బ్రసన్నతఁ గాంత్రు నాకు.

29


తే.

భూసురుల కిందువర్ణులు భూపతులకు, జలజమిత్రవర్ణులు వణిజులకుఁ గనక
వర్ణు లొగి శూద్రులకు నీలవర్ణు లగుచు, వెలుఁగుపితరుల కొనరింతు వినతి భక్తి.

30