పుట:మార్కండేయపురాణము (మారన).pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్వారోచిషమనుచరిత్రము

క.

అని చెప్పిన విని క్రోష్టుకి, మనమునఁ గడు సంతసిల్లి మార్కండేయుం
గనుఁగొని యే నడిగినవిధ, మనఘా! యేర్పడఁగఁ జెప్పి తంతయుఁ బ్రీతిన్.

211


వ.

స్వాయంభువమన్వంతరం బేమనువు వర్తించె నతనికాలంబునం గలదేవతలు
ఋషులు రాజులు నెవ్వ రెవ్వ రెఱింగింపవే యనిన మృకండునందనుం డతనితో
స్వారోచిషమన్వంతరప్రకారంబుఁ జెప్పెద నాకర్ణింపుము.

212

సిద్ధప్రసాదమునఁ బ్రవరుఁ డనువిప్రుఁడు హిమవంతమున కేగుట

క.

వరుణాతటినీతటమున, నరుణాస్పద మనుపురంబునం దతులగుణో
త్తరుఁడు గలఁ డొక్కధరణీ, సురవరుఁ డశ్వినులకంటె సుందరుఁ డెందున్.

213


చ.

అతిసుకుమారమూర్తి ప్రవరాఖ్యుఁ డుదాత్తుఁడు వేదపారగుం
డతిథిజనార్చనాభిరతుఁ డై చరియించుచు శైలకాననాం
చితసకలావనీతలవి శషము లెల్లను బ్రీతిఁ గన్గొన
న్మతిఁ గడుఁ గోరుచుండ నొకనాఁ డొకయౌషధసిద్ధుఁ డింటికిన్.

214


ఉ.

వచ్చిన నాద్విజుం డతని వందనపూజల హృష్టచిత్తుఁ గాఁ
జెచ్చెరఁ జేసి యిమ్మహి విశేషపుఁజోద్యము లేవి సూచి తీ
వచ్చుగఁ జెప్పవే యనిన నౌషధసిద్ధుఁ డనేకదేశముల్
గ్రచ్చఱ నేను ద్రిమ్మరితిఁ గాంచితి నం దొగిఁ బెక్కుచోద్యముల్.

215


వ.

అని చెప్పిన నవ్విప్రుండు భూసురవరుం దప్పక చూచి నవ్వుచు.

216


ఉ.

వాయపురజ్జు లేల మునివల్లభ! వృద్ధుఁడ వొండెఁ గావు లేఁ
బ్రాయపువాఁడ వద్రి వనరమ్యము లైనయనేకదేశము
ల్ధీయుత! యల్పకాలమునఁ ద్రిమ్మర శక్యమె! నీకు నెమ్మెయి
న్వేయును నేల నమ్మ నెద నీపలు కన్న మునీంద్రుఁ డిట్లనున్.

217


ఉ.

ఏ నొకసిద్ధుఁడ న్విను మహీసురశేఖర! ధాత్రి యంతయు
న్మానుగఁ బాదలేప మనుమందుప్రభావమునం జరించితి
న్దానిఁ బదంబులందుఁ దగఁ దాల్చిన నెంతయు నిర్జితశ్రముం
డై నరుఁ డేఁగు యోజనసహస్రము నాపగలింటిలోపలన్.

218


చ.

అనవుడు నాద్విజుండు ప్రియ మారఁగ సిద్ధునిమాట యూఁది యి
ట్లను ధరఁ జూచువేడ్క హృదయంబునఁ బాయదు నాకుఁ బాదలే
పనపరమౌషధంబు మునిపాలక! యిచ్చి కృతార్థుఁ జేయవే
నను నని వేఁడుకొన్న మునినాయకుఁ డాతని కిచ్చె నిచ్చినన్.

219


క.

ఆదివ్యౌషధముం దన, పాదంబులయందుఁ దాల్చి పవనరయమున
న్భూదేవుఁ డుదఙ్ముఖుఁ డై, మోదంబున హిమనగేంద్రమునకుం జనియెన్.

220