పుట:మార్కండేయపురాణము (మారన).pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అని భారతవర్షప్రకారంబుఁ జెప్పి మార్కండేయుండు.

192

భద్రాశ్వవర్షవర్ణనము

సీ.

భద్రాశ్వవర్షప్రభావంబు వినుము శైవాలనీలశ్వేతవర్ణపర్ణ
శాలాగ్రములు కాలజంబును నన నేను కులశిలోచ్చయములు వెలుఁగుచుండు
క్షుద్రాచలంబులు గొలఁదికి వేయేసి పడసినదేశము ల్బహుసహస్ర
సంఖ్యలఁ బొలుపారు శంభావతియు శీతయును భద్ర యనునదు లొప్పుచుండు


తే.

జనులు శంఖహేమసదృశతనుద్యుతి, భాస్వరులును బుణ్యపరులు సములు
సకలసుగుణయుతులు శతసమాయుషులు నై, మండ్రు మునివరేణ్య! మనుజు లెల్ల.

193


వ.

అందు జనార్దనుం డశ్వశిరుండును జతుర్భుజుండును నై.

194


క.

విలసిల్లు నమ్మహాత్ముని, తల హృదయము లింగ మంఘ్రితలములు హస్త
ములు కన్నులు ననునెలవుల, నెలకొను విను కృత్తికాదినిఖిలర్క్షములున్.

195

కేతుమాలవర్షవర్ణనము

క.

విమలము కృష్ణమ్ము విశో, కమును జయంతంబు హరినగము ననఘ! విశా
లము వర్ధమానమును నా, నమరు గిరులు కేతుమాల మనువర్షమునన్.

196


చ.

మఱియు ననేకభూధరసమాజములందుఁ గడు న్వెలుంగు న
త్తెఱఁగున నుల్లసిల్లు బహుదేశసహస్రములందు సంపద
న్మెఱయుచునుండుఁ గామిని సుమేధయుఁ జక్షువునాఁగ నేళు లే
ర్తెఱ జను లెల్ల నెప్పుడు తదీయజలంబులు ద్రావి తృప్తులై.

197


తే.

బ్రతుకుదురు నూఱులేసియబ్దంబులందు, హరి వరాహరూపంబున నమరు నతని
పాదవదనహృదయపుచ్ఛపార్శ్వములఁ గ్ర, మమునఁ గృత్తికాముఖతారకములు వొలుచు.

198

కురువర్షవర్ణనము

మ.

కురువర్షంబు మనోహరంబు సుమనోగుచ్ఛమ్ముల న్సత్ఫలో
త్కరగుచ్ఛంబుల నొప్పి కల్పతరుసంతానంబు లిష్టార్థము
ల్గురియ న్వస్త్రవిభూషణాదు లొగిఁ గైకొంచు న్మనుష్యు ల్సుఖిం
తురు దా రందు సుగంధబంధురమరుత్పుష్టప్రమోదాత్ములై.

199


క.

మిథునములై పుట్టి జనులు, మిథోనురాగములఁ జాల మెఱసి బహుమనో
రథసుఖము లనుభవించుచు, రథాంగమిథునములమాడ్కి రమియింతు రొగిన్.

200


తే.

అమరలోకపరిచ్యుతు లైనవారు, వచ్చి జన్మింతు రాకురువర్షభూమి
వినుము వారికిఁ బదునాల్గువేలమీఁద, నయిదునూఱులు వర్షము లాయు వనఘ!

201


సీ.

సురుచిరశశికాంతసూర్యకాంతాచలమ్ములు రెండు వెల్గు నాభూమి వాని
మధ్యంబునందు నిర్మలజలౌఘిని భద్ర సోమతరంగిణి సొంపు మిగులు