పుట:మార్కండేయపురాణము (మారన).pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వలయితపూర్వదక్షిణాపరం బైన యిట్టిభారతవర్షంబునకు నుత్తరంబున హిమ
వంతంబు కార్ముకంబునకు గొనయంబును బోలె శోభిల్లు.

181


చ.

పరమమునీంద్ర! యంతకును భారతవర్షము బీజ మిందయి
న్నరులు శుభక్రియాపరత నాకసుఖానుభవంబు బ్రహ్మతా
మరవిభుతామరత్వములు మానుగఁ గాంతురు వేయు నేల తా
నరయఁగఁ గర్మభూమి యిది యన్యము లన్నియు భోగదేశముల్.

182

శ్రీకూర్మసంస్థానవర్ణనము

మ.

అనినం గ్రోష్టుకి సంతసిల్లి మునిముఖ్యా! చెప్పి తీ విట్టు లిం
పొనర న్భారతవర్షభంగి వినఁగా నుల్లంబున న్వేడ్క యిం
కను సంధిల్లెడుఁ జెప్పవే కమఠమై కంజాక్షుఁ డింద్రుండుఁ దా
నని ము న్నానతి యిచ్చి తె ట్లచటఁ దా నద్దేవుఁ డుండు న్దగన్.

183


వ.

అని యడిగిన భృగుపాత్రుం డి ట్లనియె.

184


సీ.

హరి కూర్మరూపంబు ధరియించి భారతవర్షంబునందు సంవ్యాప్తి నొందెఁ
బ్రాగ్వదనుండు నపరపుచ్ఛుఁడును దక్షిణోత్తరపార్శ్వుండు నొగిని హుతవ
హాశాదివిదిగన్వితాంఘ్రిచతుష్కుండు నై యుండుఁ గృత్తిక యాది గాఁగ
నక్కమఠంబుమధ్యంబున నుండి వక్త్రంబును మొదలుగా దక్షిణముగ


తే.

ననఘ తన్నవాంగములయందు మూఁడు, సేసి తారలు నడుమ వసించు నెపుడు
తత్తదంగదేశస్థితతారకముల, ఫలమునుం గ్రహఫలములు వలయు నెఱుఁగ.

185


క.

విను నక్షత్రగ్రహవశ, మున దేశంబులకు నశుభమును శుభమును బై
కొనుఁ దత్పీడల విబుధులు, కని శాంతి యొనర్పవలయు గ్రక్కున ననఘా!

186


తే.

పుణ్యవంతులగ్రహపీడ పొందఁ జాల, దతనిపశుమిత్రబంధుభార్యాత్మజులకు
భయము పుట్టించు మునివర! భాగ్యహీనుఁ, డైనపాపాత్ము నుడుగక యలఁచుచుండు.

187


వ.

కావున నక్షత్రగ్రహపీడ లెఱింగి బుద్ధిపరుండగునరుండు వానికి శాంతి సేయవలయు.

188


తే.

అనఘ! నక్షత్రముల నెల్ల నాశ్రయించి, యుండుదురు దేవతలు వారి కొగి విశిష్ట
పూజ లొనరింపఁ బీడలు పొంద వధిక, మైనశుభమును వా రిత్రు మానవులకు.

189


వ.

కూర్మమధ్యంబు మొదలుగా నున్నకృత్తికాదిసప్తవింశతినక్షత్రంబులయందుఁ
దొమ్మిదేసిపాదంబుల కొక్కరాశిగా వృషభాదిరాసులు పండ్రెండు నక్కమఠంబు
నవయవంబులం బ్రదక్షిణించియుండు నిట్లు నక్షత్రంబులందు రాసులును రాసుల
యందు గ్రహంబులును వసియించుం గావున గ్రహనక్షత్రపీడలం జేసి దేశపీడ
లౌట నిశ్చయించి స్నానదానజపహోమాదుల శాంతి సేయునది యిది జగత్కా
రణుం డైననారాయణుండు కూర్మరూపంబున నున్నవిధం బని చెప్పి మఱియును.

190


క.

నన్నూఱును మున్నూఱును, నిన్నూఱును నూఱు నేఁడు లీవర్షమున
న్సన్నుత నాలుగుయుగముల, కిన్నరులకుఁ గలుగునాయు విధ్ధచరిత్రా!

191