పుట:మార్కండేయపురాణము (మారన).pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

ఇంక మహానదులవిధంబు వినుము గంగ సరస్వతి చంద్రభాగ యమున శతద్రువు
శరావతి కుహువు గోమతి బాహుద దృషద్వతి విపాశ దేవిక గండకి కౌశికి యను
నేఱులు హిమవత్పాదంబునం బ్రభవించె వేదస్మృతి వేత్రవతి ధాతుఘ్ని మండల
నీరావతి విదిశ చర్మణ్వతి వేదవతి వేణ్య క్షిప్ర యవంతి యనుసింధువులు పారియా
త్రాచలంబున నుదయించె శోణము మహానదము రుక్మద సురథ క్రియ మందాకిని
దశార్ణ చిత్రకూట చిత్రోత్పల తమస కరతోయ పిశాచిక పిప్పల శ్రోణి విపాశ
వంజల సుమేరుజ ముక్తిమతి ముద్గలి యనుతరంగిణులు ఋక్షవంతంబున నావిర్భ
వించె సువాహిని పయోష్ణి నిర్వింధ్య నిషధావతి వైతరణి సినీవాలి కుముద్వతి
మహాగౌరి దుర్గ యంతశ్శిర యనుమహావాహినులు వింధ్యంబునం బుట్టె గోదావరి
భీమరథి కృష్ణవేణి తుంగభద్ర సుప్రయోగ కావేరి యనునదులు సహ్యపర్వ
తంబున నుద్భవించెఁ గృతమాల తామ్రపర్ణి పుష్పజాతి యుత్పలావతి యను
నీనదులు మలయాచలంబున నుదయించెఁ బితృసోమ ఋషికుల్య యిల లాంగూ
ని వంశకర యనుస్రోతస్వినులు మహేంద్రంబున జనించె ఋషితుల్య కుమారి
మందగ మందవాహిని పలాశిని యనుతటినులు శుక్తిమంతంబుస్ నవతరించె నని
చెప్పి.

176


క.

విను గంగ లన సరస్వతు, లనఁగాఁ బెంపొంది యిమ్మహానదు లెల్ల
న్వననిధిఁ గూడి సకలజగ, మునకుం దల్లు లయి పాపములఁ బొలియించున్.

177


వ.

మఱియును క్షుద్రనదులు పెక్కు గల వవి వర్షకాలతోయంబులును సర్వకాల
తోయంబులును గల్గియుండు నని వెండియు.

178


క.

సురుచిర మగుసహ్యనగో, త్తరమున విలసిల్లుచుండుఁ దద్దయు గోదా
వరి తత్ప్రదేశము మనో, హరము పవిత్రము మునీంద్ర! యఖలధరిత్రిన్.

179


తే.

మత్స్య మశ్వంబు కూటంబు మఱియుఁ గుల్య, కుంతలంబులు గాశియుఁ గోసలంబు
నాదిగా మధ్యదేశంబునందుఁ బొలుచు, జనపదంబులు సతతంబు మునివరేణ్య!

180


వ.

ఆమధ్యదేశంబునకు నుదీచ్యంబులై భార్గవపురంబును బాహ్లిక వాట ధానాభీర
గాంధార సింధు సౌవీర మద్ర కేకయ కాంభోజ దరద బర్బర చీన శాశ్మీర
హుహుకాదులును బ్రాచ్యంబులై యంతర్గిరి మలద మలవర్జిక ప్రాగ్జ్యోతిష
విదేహతామ్రలిప్రకమల్లమాగధాదులును దాక్షిణాత్యంబులై పాండ్య కేరళ
చోళ కుల్య మహారాష్ట్ర మహిష కళింగ విదర్భ కుంత లాంధ్రాదులును బ్రతీ
చ్యంబులై సూర్యారక పుళింద సారస్వత సౌరాష్ట్రావంతాదిజనపదంబు లభి
రమ్యంబు లగు మఱియు వింధ్యాదిపర్వతాశ్రయంబులయందుఁ గురుషమేల
కోత్తమార్ణ దశార్ణ భోజ కిష్కింధక కోసల నూపుర తుంబుర నైషధ వీరహోత్ర
నీహార త్రిగర్తాదిదేశంబులు సమస్తవస్తుసంపద్భరితంబులై యుండు జలనిధివలయ