పుట:మార్కండేయపురాణము (మారన).pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

కనకగిరీంద్రపశ్చిమముఖంబున నవ్విపులాద్రిమీఁదికి
న్జని వెస నమ్మహానది సుచక్షువు నా విలసిల్లి తద్వనం
బును గొలను న్వడిం దఱిసి పోయి నగంబు లతిక్రమించి త
ద్వననిధిఁ గేతుమాల మనువర్షమునం దొగిఁ గూడి రూఢిగన్.

165


చ.

పరగి సురాచలోత్తరసుపార్శ్వనగంబున కేఁగి తత్సరో
వరము వనంబు సొచ్చి జనవందితయై యట శంఖకూటభూ
ధరముఖభూరిభూధరకదంబపదంబున డిగ్గి గంగ యు
త్తరకురుభూముల న్జలధిఁ దాఁ గలసె న్విను భద్రసోమ నాన్.

166


తే.

అనఘ కింపురుషాదివర్షాష్టకమున, నెంతయును నొప్పుఁ గులగిరు లేడు నేసె
నిర్మలోదకబహునదీనివహ మమరు, వ్యాధు లాధులు పాపము లందు లేవు.

167


వ.

అనిన విని క్రోష్టుకి యి ట్లనియె.

168

భారతవర్షవిషయము

క.

యతివర! జంబూద్వీప, స్థితి యంతయు నేర్పడంగఁ జెప్పతి దగ భా
రతవర్షం బెట్టిది? సన్మతి దాని నెఱుంగఁ జెప్పు మానుగ నాకున్.

169


వ.

అనిన మార్కండేయుండు.

170


తే.

పరమ మీభారతాహ్వయవర్షమునకుఁ, గలవు సెప్పెద నవభేదములు మునీంద్ర!
సాగరాంతరితంబులై జనుల కరుగ, రాని నెనిమిదిదీవులు వాని వినుము.

171


వ.

ఇంద్రద్వీపంబును గేతుమంతంబును దామ్రవర్ణంబును గభస్తిమంతంబును నాగ
ద్వీపంబును సౌమ్యంబును గాంధర్వంబును వారుణంబును నన దక్షిణోత్తరం
బుల వేయేసి యోజనమ్ముల నిడుపై యుండు నందుఁ దూర్పుదీవులు కిరాతబహు
ళమ్ములు పడమటిదీవులు యవనసమన్వితములై యతిశయిల్లుచుండు బ్రాహ్మణ
క్షత్రియవైశ్యశూద్రసమృద్ధంబును సాగరపరివృతంబును బుణ్యపాపార్జనస్థానం
బును నై యనఘంబైన యీభారతవర్షంబునందు.

172


క.

వినుము మహేంద్రము మలయ, మ్మును సహ్యము శుక్తిమంతమును ఋక్షనగ
మ్మును వింధ్యపారియాత్రము, లును నన నేడు మిగులం బొలుచును గులగిరుల్.

173


వ.

మఱియును.

174


సీ.

లలితంబు లైనకోలాహలమందర వైభ్రాజదర్దురవైద్యుతములు
శాంతంబు లైనతుంగప్రస్థమైనాకసురసపాండురపుష్పగిరులుఁ గరము
పొలు పైనరైవతార్బుదఋశ్యమూకగోధనకూటశైలంబులును సమున్న
తము లైనయాజయంతంబు గోమంతంబు భాసురం బైనశ్రీపర్వతంబు


తే.

వినుత మైనచకోరంబు నన మహాద్రు, లమరు మఱియు ననేకంబు లల్పనగము
లమ్మహాచలమ్ములచుట్టు నతిశయిల్లు, జనపదంబు లార్యములు మ్లేచ్ఛములు ననఁగ.

175