పుట:మార్కండేయపురాణము (మారన).pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


లును భయునికి వేదనకు దుఃఖుండును బుట్టిరి వా రందఱు నూర్ధ్వరేతస్కు
లైరి నిరృతికి నలక్ష్మి యనుకూఁతురు పుట్టె దానికి మృత్యువు భర్త యయ్యె
నామృత్యువునకు నలక్ష్మికిం బదునలువురు నందనులు గ్రమంబున.

62


చ.

కలిగి యలక్ష్మిఁ జేయుచును గ్రక్కున మృత్యువు నావహించుచు
న్నెలకొని నాశకాలమున నెట్టన మర్త్యులఁ జొచ్చి యింద్రియ
మ్ములు పదియింటను న్మదినిఁ బొంది యహంకృతిఁ జెంది బుద్ధియం
దొలసి కడు న్విమోహమున నొంది యజస్రము సూక్ష్మమూర్తులై.

63


క.

పురుషులు నెలఁతల విషయా, తురులుగఁ గలఁచుచు ననేకదురితకరులు గాఁ
బురిగొలుపుచు రాగాదులఁ, బరిభూతులఁ జేయు చిట్లు ప్రసరింతు రిలన్.

64

దుస్సహోత్పత్తి

వ.

అని చెప్పి మార్కండేయుండు విను మధర్మునికి నధోముఖుండును దంష్ట్రాకరాళుం
డును నతిభైరవారావుండును నైనపుత్త్రుండు దుస్సహుం డనువాఁ డుద్భవించి
క్షుత్పిపాసాపీడితుండై భువనంబులు భక్షింపఁ దొడంగిన బ్రహ్మయతని కి ట్లనియె.

65


క.

ఓహో! దుస్సహ! యీయు, త్సాహము వల దుడుగు మలుక శమ మొందుము నీ
కాహర మగునే జగములు?, మోహమున రజస్తమముల మునుఁగకు మనినన్.

66


వ.

ద్రుహిణునకు దుస్సహుం డి ట్లనియె.

67


తే.

నోరు వఱువట్లు పట్టెడు నీరువట్టు, నిలువ రాదు పేరాఁకట నిమిష మైన
నెట్లు తృప్తుండ నగుదు లా వెట్లు గాంతు, నెందు వసియింతు నేఁ జెప్పవే మహాత్మ!

68


వ.

అనిన బ్రహ్మ యి ట్లనియె.

69

బ్రహ్మ దుస్సహున కాహారాదుల నేర్పఱుచుట

తే.

జనులయిండులు నీకు నాశ్రయము ధర్మ, నియతి లేనివారలు విను నీకు బలము
నిత్యకృత్యక్రియాహాని నీకుఁ బుష్టి, యంబరము నీకు లూతాచయమ్ము సుమ్ము.

70


వ.

నీ కాహారం బాకర్ణింపుము.

71


సీ.

శునకేక్షితాన్నంబు విను కేశకీటదుష్టమ్మును భిన్నభాండస్థమును వ
దనగహ్వరమున నూఁదినయవియును వేఁడి గానివి పక్వంబు గానియవియు
నవని సంస్కృతి లేనియవియు శీర్ణాసనమున నుండియును విదిఙ్ముఖత సంధ్య
లందును గీతవాద్యంబులు వించు రజస్వలఁ జూచుచు జనులు గుడుచు


ఆ.

నోదనములు మఱియు నొండుపహతిఁ బొంది, నట్టిభోజ్యసంచయములుఁ బ్రీతి
నధికతృప్తి సేయు నాహారములుగ నా, చేత నిపుడు నీకుఁ జెప్పఁబడియె.

72


క.

శ్రుతిశాస్త్రపురాణవినిం, దితకర్మము లాచరించు ధీరహితుని దు
ష్కృతఫలముల నోదుస్సహ!, సతతంబును దృప్తి నీకు సంపాద్య మగున్.

73


తే.

పంక్తిభేదవృథాపాకపాక భేద, కరుల నన్యోన్యసంతతకలహపరుల
గోగజాశ్వచయాపోషకులును నైన, నరులయిండుల నెందులఁ దిరుగుచుండు.

74