పుట:మార్కండేయపురాణము (మారన).pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకాదశరుద్రసర్గము

క.

తెలిగన్ను కవిలకన్నును, వలిచన్నును దృఢవిశాలవక్షము నెఱివే
నలి కెంజడలును గలిగిన, వెలఁదియు మగవాఁడు నైనవేల్పై నిల్చెన్.

53


క.

నిలిచినఁ గనుఁగొని యిమ్మెయిఁ, గలసినయయ్యొడలు రెండుగా విభజింప
న్వలయు నని యజుఁడు పలికినఁ, బొలుపుగ నవ్వేల్పు సతియుఁ బురుషుఁడు నయ్యెన్.

54


క.

ఆపురుషుం డేకాదశ, రూపమ్ములు దాల్పె వారు రుద్రు లనంగా
దీపించి రంత నాస్త్రీ,రూపంబును నతఁడు పెక్కురూపులు సేసెన్.

55


వ.

మరియుం బ్రజాపతి.

56


క.

విను భృగుఁ బులస్త్యుఁ బులహుని, నొనరఁగ నంగిరసు నత్రి నొగిఁ గ్రతువు వసి
ష్ఠుని దశుక్షు మరీచి సృజిం, చె నవబ్రహ్మలుగ నజుఁడు చిత్తస్మరణన్.

57


వ.

సంకల్పుఁడును ధరుఁడు ననుపుత్రులఁ బుట్టించి యవ్విరించి మఱియును.

58

స్వాయంభువమనుసంభవము

క.

వినుము ప్రజాపాలనపరు, ననుపమసత్త్వాభిరాము నాత్మసమాను
న్ఘను నాస్వాయంభువుఁ డను, మనువు న్శతరూప యనుకుమారి సృజించెన్.

59


తే.

వారు దంపతులయి ప్రియవ్రతుఁడు సద్గు, ణాఢ్యుఁ డుత్తానపాదుండు ననఁగఁ బరగు
సుతయుగంబును సూతిప్రసూతు లనఁగఁ, గన్యకల నిద్దఱను నొగి గాంచి రెలమి.

60

దక్షసర్గము

ఆ.

ఆప్రసూతి దకుఁ డాసూతి నింపార, రుచియుఁ బెండిలైరి రుచికిఁ బుట్టి
రనఘ! దక్షిణయును యజ్ఞుండు వారికి, యామనామధేయు లైనసుతులు.

61


వ.

పన్నిద్దఱు పుట్టిరి మఱి దక్షునకుం బ్రసూతికి నిరువదినలువురు కూఁతులు పుట్టి రందు
ధర్మునికిఁ బదుమువ్వురును భృగునికి ఖ్యాతియు భవునికి సతియు మరీచికి సంభూ
తియు నంగిరసునకు స్మృతియుఁ బులస్త్యునకుఁ బ్రీతియుఁ బులహునకు క్షమయుఁ
గ్రతువునకు సంతతియు నత్రికి ననసూయయు వసిష్ఠునకు నూర్జయు సగ్నీకి
స్వాహయుఁ బితరులకు స్వధయు ననం బదునొక్కండ్రను భార్యలుగా నిచ్చె
నాధర్మునికిం గ్రమంబున శ్రద్ధయందుఁ గాముండును లక్ష్మియందు దర్పకుండును
ధృతియందు నియముండును దుష్టియందు సంతోషుండును బుష్టియందు లోభుం
డును మేధయందు శ్రుతుడు గ్రియయందు నయవినయదండులును బుద్ధియందు
బోధుండును లజ్జయందు వినయుండును వపువందు వ్యవసాయుండును శాంతి
యందు క్షేముండును సిద్ధియందు సుఖుండును గీర్తియందు యశుండును బుట్టిరి.
మఱి శ్రద్ధాపుత్రుం డైనకామునికి మతికి హర్షుండు పుట్టె నధర్మునికి హింసకు ననృ
తుం డనుకొడుకును నిరృతి యనుకూఁతురుం బుట్టి దంపతులైరి పదంపడి వారికి
భయుండును మాయయు నరకుండును వేదనయు ననుమిథునద్వయంబు పుట్టె
నమ్మాయకు నరకునికి మృత్యువు పుట్టె మృత్యువునకు వ్యాధిజరాశోకతృష్ణాక్రోధు