పుట:మార్కండేయపురాణము (మారన).pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

నక్షత్రగ్రహపీడ లొందిన నొగి న్నానావిధోత్పాతము
ల్ప్రక్షోభించిన శాంతి సేయనినరు ల్గాదంబరీస్త్రీమృగ
వ్యాక్షాసక్తులు గృత్రిమవ్రతులు మిథ్యాచారు లాత్మీయధ
ర్మక్షీణు ల్భవదీయశాసనమున న్బ్రాపింతు రత్యంతమున్.

75


క.

విను వైశ్వదేవ మొనరిం, చినతుది నీపేరు సెప్పి చెలువుగ బలి యి
చ్చినవారిసదనములకు, న్జనకుము విహరింపు మితరజనసదనములన్.

76


క.

పితృదేవతార్చకులు సం, తతశుచులు నలోలుపులు జితస్త్రీకులు సం
స్కృతరుచిరాన్నభుజులు నగు, నతిపుణ్యులసదనములకు నరుగకు మెపుడున్.

77


క.

బాలస్త్రీ వృద్ధస్వజ, నాలికి నేయిండ్ల నెయ్య మగ్గలము కుల
స్త్రీ లెందు బహిర్గమనవి, లోలలు కా రట్టియిండ్లలోను జొరకుమీ.

78


ఉ.

బొంకక జీవహింస దెసఁ బోవక యేరికిఁ జిత్తతాప మే
వంకను జేయ కీ సుడిగి వైరము లేక శమంబు దాల్చి ని
శ్శంకత నైజధర్మములు సల్పుచు నెమ్మది నుండునన్నిరా
తంకులపుణ్యమందిరవితానముపొంతకుఁ బోకు దుస్సహా!

79


క.

పతిభక్తి గలిగి పోష్యులు, పతి గుడిచిన మఱియుఁ గుడిచి పతిశుశ్రూషా
న్వితయై దుష్టస్త్రీసం, గతి సేయనియతివఁ జేరఁగా వలదు సుమీ!

80


క.

అనలం బాఱక సలిలం, బును నెపుడును గల్గి తల్పములు భానుని గ
న్గొనరానిచోట నుండుస, దనములు దుస్సహ! రమాసదనములు సుమ్మీ!

81


క.

విను దుస్సహ! విలసచ్చం, దనవీణాముకురమధుఘృతప్రతతియు గో
వును దామ్రపాత్రములు గల, జనమందిరములకు నీకుఁ జన రాదు సుమీ!

82


తే.

అర్థి నేర్పడఁగా విను మాఁడువారు, మువురు మగవార లేవురు మూఁడుధేను
వులును రేపులె వెలుఁగును గలమనుష్యు, ని ల్లధర్మతనూజ! నీ కిరవు సుమ్ము.

83


క.

విను మేఁక గొఱియలు మొదవు, లెనుములు తురగములు గజము లిం దొకటియు రెం
డును మూఁడును నేనును నా, ఱును నేడును నుండునది గుఱుతు నీ కుండన్.

84


క.

కొడవలి గొడ్డలి పీఠము, లెడనెడ నెరయంగ వైచునిండ్లును మఱి యొ
క్కెడ ఱోలును రోఁకళ్లును, నిడినగృహంబులును నీకు నిరవులు నిలువన్.

85


క.

ఏయిండ్లను గొలుచు సరకు, సేయరు భోజ్యములు లెక్క సేయరు ధనురా
ద్యాయుధములు గైకొన రీ, వాయిండులఁ గేలి సలుపు మనవరతంబున్.

86


వ.

అని బహువిధముల దుస్సహుని శాసించి ద్రుహిణుం డంతర్హితుం డయ్యె నంత.

87

దుస్సహసంతానదురాచారప్రకారము

తే.

కలికిభార్యకుఁ బుట్టినకన్యఁ బెండి, లయ్యె నిర్మాష్టి యనుదాని నయ్యధర్ము
కొడుకు దుస్సహుఁ డుజ్జ్వలగుణవరేణ్య, వారి కిరువురకును విను వరుసతోడ.

88