Jump to content

పుట:మార్కండేయపురాణము (మారన).pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పదియేను పక్షంబు పక్షంబులు రెండు మాసంబులు మాసషట్కం బయనం బయన
ద్వయంబు సంవత్సరం బయనంబు రెండు దేవతలకు నొక్కయహోరాత్రం బట్టి
యహోరాత్రంబు లైన దివ్యాబ్దంబులు పండ్రెండువేలు చతుర్యుగం బనఁ బరగు
నందుఁ గృతయుగంబునకు సంఖ్య నాలుగువేలు దానిసంధ్యయు సంధ్యాంశంబును
నన్నూఱేసి త్రేతాయుగంబునకు సంఖ్య మూఁడువేలు దానిసంధ్యయు సంధ్యాం
శంబును మున్నూఱేసి ద్వాపరయుగంబునకు సంఖ్య రెండువేలు దానిసంధ్యయు
సంధ్యాంశంబును నిన్నూఱేసి కలియుగంబునకు సంఖ్య వేయి దానిసంధ్యయు
సంధ్యాంశంబు నూఱేసి యిట్టిదివ్యాబ్దద్వాదశసహస్రంబును గలయట్టిమహాయు
గంబులు వేయి బ్రహ్మకు దినంబనం జను.

18


చ.

మను వుదయింపఁగా మునులు మానుగ నిర్జరవల్లభుండు న
య్యనిమిషులు న్మనుప్రభృతు లైననృపాలురు గల్గి పెంపున
న్ఘనముగ మందు రమ్మనువుకాలము వోయినఁ బోదు రందఱు
న్మనువులు పుట్టి యిట్లు పదునల్వురు సెల్లుదు రద్దినంబునన్.

19


క.

పదునలువురు మనువులు భూ విదితముగ మహాయుగములు వేయిటిలోన
న్ముదమున నొక్కొకరుఁడు డె, బ్బదియొక్కయుగమున కనఘ! పతి యగు వరుసన్.

20


వ.

ఆడెబ్బదియొక్కమహాయుగంబులకు ముప్పదికోట్లు నఱువదియేడులక్షలు నిరువది
వేలు మానుషాబ్దంబు లగు నిది మన్వంతరంబులవిధంబు మఱియు నొక్కమన్వంత
రంబున దివ్యాబ్దంబులసంఖ్య యెనిమిదిలక్షలు నేఁబదిరెండువే లగువానిం జతు
ర్దశగుణితంబుఁ జేసిన బ్రహ్మకు దినం బద్దినాంతంబునఁ గలుగులయంబు బుధులు
నైమిత్తికం బని చెప్పుదు రప్పు డేకార్ణవం బైయుండు నజ్జలంబులయందు నారా
యణాభిధానుండై బ్రహ్మ తేలుచు నహఃప్రమాణరాత్రి యెల్లను నిద్రించి వేగు
టయు నెప్పటి యట్ల ప్రజల సృజియించు నట్టియహోరాత్రంబులం గలవర్ష
శతంబునందు.

21


తే.

అనఘ యేఁబదియేండ్లు పరార్ధ మనఁగ, నొనరు నింతకు మును బ్రహ్మ కొకపరార్థ
మరిగె దానియంతమునఁ బాద్మాభిధాన, కల్ప మయ్యె నుత్తమగుణాకల్పవిభవ!

22


వ.

ద్వితీయపరార్ధంబునం దిప్పుడు వరాహకల్పంబు వర్తించుచున్నది యనిన మార్కం
డేయునకుఁ గ్రోష్టుకి మహాత్మా! ప్రజాపతి ప్రజల నెట్లు సృజియించుం జెప్పవే
యనిన నమ్మునీంద్రుండు పాద్మాభిధానకల్పాంతప్రళయనిశావసానసమయంబున
మేలు కాంచి శూన్యం బైనలోకంబు నాలోకించి.

23


సీ.

నారాయణుం డగునలువ సముద్యద్వరాహరూపముఁ దాల్చి రభసలీల
నామహర్లోకపర్యంతంబు దొట్టిన యంబుపూరముఁ జొచ్చి యతలమునకు
నరిగి ధరిత్రి దంష్ట్రాంకురాగ్రంబున మెల్లన జలములమీఁది కెత్తె
నందుఁ బేరోడయందట్లు దేలుచు నున్నదాని సమస్థలిఁగా నొనర్చి