పుట:మార్కండేయపురాణము (మారన).pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


లడరి నడుతలవ్రేసిన నమ్మనుష్యుఁ, డాఱునెలలు గాని మనఁ డుదాత్తపుణ్య!

348


తే.

పాంసువృష్టిచేతను గాకపంక్తిచేత, మానవునితల పీడిత మైన మేని
నీడ యొండుచందం బైన నెలలు నాల్గు, గాని యాయువు గలుగదు వాని కనఘ!

349


సీ.

ద్విత్రిమాసములలోఁ దెగు నరుఁ డపగతమేఘయామ్యమ్మున మెఱుఁగు నింద్ర
ధనువున నుదకంబు గనినఁ దైలాజ్యాంబుదర్పణాంతరమునఁ దనదురూపు
తల లేక తోఁచిన నెలఁ జచ్చు గొరియగ దురు శవగంధంబు బొరయఁ దనువు
నర్ధమాసాయుష్యుఁ డగును నీళ్లాడిన నతనికాళ్లును హృదయంబు మిగుల


తే.

నెండినను నీరు ద్రావంగ నెసఁగి దాహ, మగ్గలించిన విను దశాహమునఁ దీఱు
ఋక్షకపియానగతుఁ డైన దక్షిణమున, కొనరఁ బాడుచుఁ జనఁ గలఁ గనియెనేని.

350


చ.

ఇనుఁ డుదయంబు సేయ వఱ డెవ్వనికై యెదు రేఁగు నిష్ఠుర
ధ్వని సెలగంగ నెవ్వనికిఁ దద్దయు నాఁకలి యుద్భవిల్లు భో
జన మొనరించినప్డు నెద సాధ్వస మూరక పుట్టుచుండు నె
వ్వని కొగి రేయునుం బగలు వాఁడు యమాలయగామి భూవరా!

351


ఉ.

ఎవ్వఁడు పెల్చఁ బ ల్కొలుకు నెంతయు నన్యునితారకంబులం
దెవ్వనిరూపు దోఁప దొగి నింద్రధనుర్గ్రహతారకోత్కరం
బెవ్వఁడు రాత్రియు న్బగలు నేర్పడఁ గాంచు స్రవించుచుండుఁ దా
నెవ్వనిసవ్యనేత్రమున నెప్పుడు నీరము వా రనాయుషుల్.

352


తే.

నాసికాగ్రంబు వంగుట నాల్క నల్ల, నగుట వదనంబు గడు నెఱ్ఱ నగుట యుష్ట్ర
రాసభమ్ములు పూనినరథము నెక్కి, యమునిదెసఁ జనఁగలఁగంటయాయువడఁచు.

353


తే.

కర్ణములమ్రోఁత వ్రే ళ్ళిడఁ గలుగదేని, నీల్గుఁ బాతఱఁ బడినఁ ద న్నెగయకుండఁ
గప్పి రని మానవుఁడు గలఁగనియెనేని, యదియ తుద వానిమనుగడ కగు నరేంద్ర.

354


ఆ.

ఊర్ధ్వదృష్టి యైన నోలిని బ్రచలిత, దృష్టి యైన వక్రదృష్టి యైనఁ
బురుషుఁ డేఁగు జమున ప్రోలికి బొడ్డు లోఁ, తైన మొగము శుష్క మైన ననఘ!

355


క.

తనకట్టిన సితవస్త్రము, లనయము రక్తాసితంబు లైనపగిదిఁ దోఁ
చిన నిజభావప్రకృతులు, విను మగుడంబడిన నరుఁడు వీడ్కొను భవమున్.

356


వ.

అని చెప్పి యయ్యరిష్టంబులు మహాత్ములైన యోగులు మొదలుగా నెల్లవారికి
నెఱుంగవలయు సంవత్సరాంతంబు ఫలదంబు లగునరిష్టంబులు పరీక్షించి కాలం
బెఱింగి మరణంబునకు వెఱవక ధైర్యం బవలంబించి యోగం బనుష్ఠించుచు దివా
రాత్రంబులం దోఁచునరిష్టంబులు పరికించి యవి విఫలంబు లగునట్లుగా నయ్యైవేళ
లందు యోగయుక్తుం డగుచుఁ గాలంబు గెలిచి మనంబు సుస్థిరంబు గావించి
గుణత్రయవికృతు లడంచి యాత్ముని నాత్మయందు సంధించి తన్మయుం డై యోగి
నిరాలంబంబును నతీంద్రియంబును నైననిర్వాణంబుం బొందు నని యివ్విధంబున
యోగప్రకారం బెఱింగించి మఱియు నప్పరమయోగి యలర్కున కి ట్లనియె.

357