Jump to content

పుట:మార్కండేయపురాణము (మారన).pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ధనవిమలజ్ఞానంబు విలయంబుఁ బొందుఁ గావునం దదీయప్రవృత్తిగోపనంబు
సేయునది యని చెప్పి.

328


శా.

ఆరోగ్యంబు ననిష్ఠురత్వము నలౌల్యంబు న్వపుఃకాంతియు
న్సౌరభ్యంబును సంస్వరత్వము మనస్సౌమ్యత్వము న్మూత్రవి
ట్చారాల్పత్వము నిర్మలత్వముఁ గృపాసంగిత్వము న్బ్రాప్తయో
గారంభుం డగుయోగికిం బ్రథమచిహ్నంబు ల్మహీవల్లభా!

329


తే.

భూతములు దాను నన్యోన్యభీతి లేక, యునికి శీతోష్ణబాధ దా నొంద కునికి
భువన మనురాగమునఁ దన్నుఁ బొంద కునికి, వెలయు నివి సిద్ధలక్షణములు నరేంద్ర!

330

యోగవిఘ్నకార్యములు

ఆ.

దానయజ్ఞదేవతాపూజనాతప, స్తంత్రకలితకామజంబు లైన
కడిఁది యోగవిఘ్నకరము లౌకర్మము, ల్పరిహరింపవలయుఁ బరమయోగి.

331


వ.

మఱియును గటుకోదయంబు లైనప్రాతిభశ్రావణదైవభ్రమావర్తంబు లనుపంచ
విధోపసర్గంబులు పరిహరించి నియతాహారుండును జితేంద్రియుండును బ్రహ్మ
ప్రవణమనస్కుండు నై యోగి సూక్ష్మం బగు ధారణాసప్తకంబు ధరియించునది
తద్విధం బాకర్ణింపుము.

332


సీ.

ధరణి మూర్ధంబున ధరియించి తన్మయత్వముఁ బొంది దానిగంధంబు విడుచు
నది యట్ల జలమును నగ్నియు వాయువు వాయుపథంబును వరుసఁ దాల్చి
జననుత రసరూపసంస్పర్శశబ్దంబు లనుగుణంబులఁ ద్రోచునది క్రమమునఁ
దనమనంబును బుద్ధియును సర్వభూతదయంబు మనోబుద్ధులందుఁ జొనిపి


తే.

ధారణాభ్యాసతత్పరత్వమునఁ జేసి, యమ్మనోబుద్ధిసౌక్ష్మ్య మొయ్యనఁ దొఱంగు
నది గురూక్తి ని ట్లతిసూక్ష్యు లైనయేడు, వృత్తుల విడిచినతఁడు నివృత్తిపరుడు.

333


వ.

ఇట్లు సప్తధారణాభ్యాసంబున జేసి పృథివ్యాదులగంధాదిసూక్ష్మగుణంబులం
దొఱంగి శుద్ధాత్ముం డగుయోగసిద్ధుం డణిమాద్యక్షైశ్వర్యసిద్ధిసంపన్నుండును
షడ్భావవికారరహితుండును యోగాగ్నిదగ్ధదోషుండును నై యనలం బనలంబు
నందును జలంబునందును నొందుచందంబునం దాను బరమాత్మైకత్వంబునం
బొందు ననవుడు నలర్కుండు బ్రహ్మపదవర్తియైన యోగిచరిత్రంబు నా కెఱిఁగిం
పవే యనిన దత్తాత్రేయుం డిట్లనియె.

334

యోగిధర్మములు

క.

మానము నవమానంబును, మానవులఁ బ్రమోదఖేదమగ్నులఁ జేయు
న్మానము యోగికి విష మవ, మానం బమృతంబు సుమ్ము మహితవిచారా!

335


వ.

అని మఱియును.

336


తే.

త్రావునుదకంబు వస్త్రపూతంబు నడుగు, వెట్టునెడ దృష్టిపూతంబు ప్రీతితోడఁ
బలుకు సత్యపూతంబును బరమమైన, తలఁపు బుద్ధిపూతంబు గావలయు యతికి.

337