పుట:మార్కండేయపురాణము (మారన).pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జెప్పెద నాకర్ణింపుము పద్మస్వస్తికాద్యాసనములలోనం దన కభిమతం బైనయాస
నంబున నాసీనుండై హృదయంబునం బ్రణవంబుఁ గదియించి వదనంబు సంవృతంబు
గావించి శిరం బించుక నెగయించి దంతంబు లొండొంటిం బొంద నీక దెసలు
చూడక నాసాగ్రంబున దృష్టి నిలిపి తమోరజంబు లడంచి నిర్మలత్వం బవలం
బించి పవనం బాకంఠపూరితంబు గావించి.

320


తే.

మనసుతోఁగూడఁ గ్రమమున మారుతేంద్రి, యములఁ గూర్మంబులోని కంగములఁ దిగుచు
నట్లు తిగువఁ బ్రత్యాహార మవ్విధంబో, నర్చి తత్త్వైకనిష్ఠ మనంబు నిలిపి.

321


క.

తనయందు యోగి తన్నుం, గనుఁగొని ధారణ యొనర్పఁ గదలక యుండు
న్మన సొగిఁ బ్రాణాయామము, లనఘా! పండ్రెండు సేయునది ధారణకున్.

322


క.

ధారణలు రెండు నివి యో, గారూఢులు యోగ మందు రఖిలాఘములు
న్దూరము లగుఁ గడు నియతా, హారులు దృఢయోగపరులు నగుయోగులకున్.

323


వ.

ఇట్లు యోగం బతిప్రయత్నంబున సాధించిన యతండు యోగి యగు వినుము
ప్రాణనియమంబు ప్రాణాయామంబు మనఃపవనేంద్రియములఁ బ్రత్యాహరించుటం
బ్రత్యాహారంబును మనంబు గదలకుండ ధరించుట ధారణయు నగు ధారణా
స్థానంబులు పది గల వాకర్ణింపుము.

324


క.

మునునాభియు హృదయము నుర, మును గంఠము నాననమును ముక్కుతుదయు లో
చనములు బొమలనడుము తల, యును నట నూర్థ్వమును నెలవు లొగి ధారణకున్.

325


చ.

అనలము నీరు కూప మురగాలయ మున్నయెడ న్జతుష్పథ
మ్మున వెఱ గల్గుచోటఁ బితృభూమి సరీసృపసంచరస్థలం
బున నది రచ్చకొట్టమున మ్రోఁత చెలం గెడిపట్టునం బొన
ర్చిన విఫలంబు యోగము విశీర్ణదలస్థలియందు మందలోన్.

326


సీ.

ఈకీడుచోటుల నేమి పొమ్మని యోగయుతుఁ డగునజ్ఞానయోగి కనఘ
యోగంబునకు విఘ్న మొనరించుదోషము లుదయించు వానిఁ జెప్పెద జడత్వ
మును బధిరత్వము మూకత్వమును విస్మృతియును నంధతయు వేఁకియు ననంగ
నట్లు ప్రమాదజ లైనయారుజలకు రయమునఁ దగుఁ బ్రతిక్రియ లొనర్పఁ


తే.

గంకు మడరు నపుడు ఘనగిరి మనమునఁ, జెవిటితనమునందుఁ జెవి సువాక్చ
యందు నీరువట్టునప్పుడు విను మామ్ర, ఫలము రసనఁ దాల్ప వలయు యోగి.

327


వ.

మఱియును యోగీశ్వరుం డుష్ణంబునందు శీతంబును శీతంబునం దుష్ణమును
ధరించునది యమానుషసత్త్వజాతబాధలు పొందెనేని వాయువహ్నిధారణం
బునంజేసి వానిం జెఱచునది ధర్మార్థకామమోక్షంబులకు సాధనంబగుట నవ
శ్యంబు శరీరంబు రక్షించునది మునిజనప్రవృత్తిలక్షణం బొరులకుఁ జెప్పుటం