పుట:మార్కండేయపురాణము (మారన).pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

కామము హేయము విడువం, గా మదికిని శక్య మెట్లు గా కున్న ముము
క్షామతి వలయుం గలవే, కామవ్యాధికి ముముక్షఁ గడచినమందుల్.

287


క.

అని పెక్కుమాఱు లతిముద, మున నాపద్యములు చదివె ముత్పులకంబు
ల్దనువునఁ బాదుకొనంగా, మన మలర మదాలసాకుమారుఁడు తండ్రీ!

288


వ.

అట్లు చదివి యమ్మహాత్ముండు శ్రేయంబు పురుషునకు ముముక్షం బోలనొండు గలుగ
దది యుత్తములసేవం గాని జనింపఁదనుచు మనమున నిశ్చయించి యప్పుడు
రహస్యవృత్తిం జని.

289

అలర్కదత్తాత్రేయసంవాదము

క.

ఆయుర్వీశుఁడు దత్తాత్రేయుం గరుణావిధేయు దేవమునిగణ
ధ్యేయు నసంగత్వమహా, స్థేయు విషయరిపుబలావిజేయు నమేయున్.

290


వ.

కని దండప్రణామం బాచరించి యంజలి యొనర్చి యార్తుం డగుచు ని ట్లనియె.

291


క.

శరణార్థి నైననాకును, శరణ మగుము జన్మమరణజనితవ్యాధు
ల్హరియింపుము నాదుఃఖము, కరుణింపుము నన్నుఁ జూడు కామభరార్తున్.

292


తే.

అనిన ముని యట్ల చేసెద నధిప! చెపుమ, వగవఁ గత మేమి నీకు నెవ్వండ నేను
వనట యెవ్వని దగునొక్కొ యని వివేక, దృష్టిఁ బరికింపు నిను నీవె తెలిసికొనిము.

293


క.

అంగంబులు చింతింపు ద, దంగిం బరికింపు మది నిరంగునిఁ గనుఁగొ
మ్మంగీకృతనిజబుద్ధి న,సంగుఁడవై యెఱుఁగు మధిప సర్వాంగములన్.

294


క.

అనిన నతఁడు నయ్యోగీం, ద్రునికారుణ్యమునఁ ద్రివిధదుఃఖస్థాన
మును నరసి యపుడఁ గనుఁగొని, తనుదా నవ్వుచును ననియెఁ దత్త్వజ్ఞుం డై.

295


సీ.

నేల నీ రనలంబు గాలి నభం బను నేనింటిపొడ వైనయీశరీర
మును మనంబును బుద్ధియును నహంకారంబు గా నేను నిత్యుండఁ గాన నెపుడు
శారీకమానసాధారము లౌసుఖదుగఖము ల్నా కవి దూరతరము
లత్యంతసంబంధ మైనదేహము తదీయంబు గా దనిన నాగాశ్వరథధ


తే.

నాదిసంబంధ మెక్కడియది విరోధి, యెవ్వఁ డింకఁ బురభ్రాంతి యేల యనుచుఁ
బరమవైరాగ్యసుజ్ఞానభరితవిమల, మానసుండై యలర్కుండు మఱియు ననఘ.

296


తే.

ఆకసం బొక్కటియ యె ట్లనేకఘటము, లందుఁ బెక్కయి తోఁచుఁ దా నట్ల యాత్ముఁ
డొకఁడ సకలంబునందును నొగి వెలుంగుఁ, గానఁ గాశీపతియు నేను గాము వేఱు.

297

అలర్కుని యాత్మవివేకము

చ.

అని తెలివొంది యమ్మునివరాగ్రణికిం గడుభక్తి మ్రొక్కి యి
ట్లనియె నలర్కుఁ డేను సుగుణాకర! నీకృప సమ్యగాత్మద
ర్శనుఁడను వీతదుఃఖుఁడను బ్రాజ్ఞుఁడ నైతి నసమ్యగాత్మద
ర్శను లగువారు దుఃఖజలరాశినిమగ్నులు గారె యెప్పుడున్?

298


వ.

అని మఱియును.

299