పుట:మార్కండేయపురాణము (మారన).pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గోర్ముల నొప్పుసంసృతిసుఖోదధిఁ దేలుచు నించు కేనియు
న్గర్మవిరక్తి లేక బహుకాల మలర్కుఁడు ప్రీతి నుండఁగన్.

276


చ.

అనఘ! తదగ్రజుండు విపినాంతరవాసి సుబాహుఁ డయ్యల
ర్కు నవిజితేంద్రియత్వమును గుత్సితరాజ్య మమత్వము న్ధనా
ర్జనకలితత్వము న్విని కరం బెద రోసి యహా! యితండు క
ర్మనిగళబద్ధుఁడై కడుబ్రమత్తత నొందునె యిట్లు మూఢతన్?

277


వ.

అని చింతించి.

278


చ.

అతనిసమగ్రబోధమహిమాన్వితుఁ జేయునుపాయ మమ్మహా
మతి మదిఁ గాంచి తద్రిపు నమందపరాక్రముఁ గాశిరాజు నా
తతచతురంగసైన్యఘసదర్పమహోజ్జ్వలుఁ గానఁబోయి తా
నతివినయంబుతోడఁ బ్రియమారఁగఁ జేరి సుబాహుఁ డి ట్లనున్.

279


చ.

శరణము గమ్ము నాకు నృపసత్తమ! నాయనుజుం డలర్కుఁ డు
ద్ధురుఁ డయి రాజ్య మంతయును దుర్వినయంబునఁ దాన కొన్నవాఁ
డరిమదభేది నా కొసఁగు మాతని నిర్జితుఁ జేసి నావుడు
న్జరుఁ బనిచె న్సుబాహు ననుజన్మునిపాలికి నమ్మహీశుఁడున్.

280


క.

పనిచిన నరిగి యలర్కునిఁ, గని చరుఁ డోయవనినాథ! కాశీశ్వరుఁ డి
మ్మని యానతిచ్చెను సుబా, హుని కి మ్మీరాజ్య ముడుగు మొండుదలంపుల్.

281


చ.

అనిన నలర్కుఁ డల్కయును హాసము మోము నలంకరింపఁ గా
శినృపతిదూతవో తగవు సెప్పితి లెస్స సుబాహుఁ డేఁగుదెం
చి నను ధరిత్రి మైత్రి విలసిల్లఁగ వేఁడిన నిత్తుఁ గాక మీ
జనపతియాజ్ఞ కే వెఱచి శౌర్యము ధైర్యము దక్కి యిత్తునే?

282


వ.

అనిన విని దూత చని యలర్కుపలుకులు కాశీశ్వరునికిం జెప్పిన సుబాహుండు
బాహువీర్యమహనీయుం డగుమహీపతికి నొరు వేఁడికొనుటయు ధర్మంబు గా
దని యూరకుండె నప్పుడు.

283


సీ.

చతురంగబలపదాహతి నిల గంపింప గాశీశ్వరుం డలర్కక్షితీశు
పైఁ జని సామాద్యుపాయప్రయోగసామగ్రిఁ దదీయసామంతదుర్గ
పాలాటవికబలావలుల నెల్లను వశగతులను గావించి యతనిపురము
చుట్టును విడిసిన స్రుక్కి తల్లడ మంది యతఁ డల్పబలుఁడును నరినిపీడ్య


తే.

మానుఁడును నిస్సహాయుండు హీనధనుఁడు, నై విషాదంబు నార్తియు నాత్మఁ జాల
నగలించినఁ దల్లిప ల్కపుడు దలఁచి, యొనర నయ్యుంగరంబునం దున్నయట్టి.

284


వ.

పరిస్ఫుటాక్షరభాసురం బగుశాసనంబు పుచ్చికొని చూచి.

285


క.

సంగంబు విడువవలయును, సంగము విడువంగఁ గడు నశక్య మయినఁ జే
యంగవలయు సత్సంగము, సంగరుజకు నౌషధంబు సద్భజన మిలన్.

286