పుట:మార్కండేయపురాణము (మారన).pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అలర్కుఁడు రాజ్యభోగము లనుభవించుట

ఉ.

అంత మనోహరప్రకటయౌవనలీల యలర్కుఁ బొందె న
త్యంతమదోల్లసద్విభవ మైంద్రగజేంద్రముఁ బొందినట్లు స
త్కాంతికళావిలాసము సుధాకరుఁ బొందినయ ట్లుదాత్తవా
సంతికవిభ్రమంబు విలసత్సహకారముఁ బొందిన ట్లొగిన్.

267


వ.

ఇ ట్లభినవయౌవనుం డై.

268


ఉ.

దారపరిగ్రహంబును నుదారగుణైకపరిగ్రహంబు వీ
రారిభయంకరోత్కటపరాక్రమకేలిపరిగ్రహంబుఁ బొ
ల్పారఁగఁ దండ్రియాజ్ఞఁ దనయౌదలఁ దాల్చి యలర్కుఁ డొప్పునా
శారదనీరదేందువిలసద్యశుఁ డై బహుపుత్రవంతుఁ డై.

269


ఉ.

అంత ఋతధ్వజుండును ననంతజరాగురుభారధుర్యతా
శ్రాంతి వహించి మేదినిభరంబు వహింపఁగ నోహటించి య
త్యంతగుణాభిరాముని నిజాత్మజుఁ బట్టము గట్టి ప్రీతితో
నింతియుఁ దానుఁ బేరడవి కేఁగి తపం బొనరించె వేడుకన్.

270


వ.

అప్పుడు మదాలస మహనీయమంగళకరం బగునొక్కగాంగేయమయాంగుళీయ
కంబు కొడుకున కిచ్చి పరమహితంబు లగువాక్యంబుల నతని కి ట్లనియె.

271

మదాలస యలర్కున కొకయుంగరం బిచ్చి హితోపదేశము సేయుట

చ.

అనఘ! మమత్వబద్ధుఁడు గృహస్థుఁడు సంతతసర్వదుఃఖభా
జన మటు గొన నెప్పుడు విషాదము బంధువియోగవిత్తనా
శనరిపుపీడలం గడు నసహ్యతరం బగునేని యప్పు డీ
కనకమయాంగుళీయకము గ్రక్కున నేర్పడఁ బాపి యిందులోన్.

272


వ.

సూక్ష్మక్షరంబుల నేను లిఖియించి యిడినకనకమయశాసనపట్టిక పుచ్చికొని చదువు
కొనునది యని యాదేశించి యతని నుచితాశీర్వాదంబుల నభినందించెఁ గువలయా
శ్వుండు నట్లు పుత్త్రునికిం బూజ్యం బైనసామ్రాజ్యం బిచ్చి మదాలసాసమన్వి
తుండై తపోవనంబు కరిగెనంత.

273

అలర్కుఁడు రాజ్యము సేయుట

చ.

అతులపటుప్రతాపమహిమార్కుఁ డలర్కుఁ డపారశౌర్యని
ర్జితరిపువీరుఁ డార్యనుతశీలుఁడు పాలనకేళిలోలుఁ డై
యతిశయలీల నేలెఁ జతురబ్ధిపరీతమహీతలంబుఁ గ
ల్పితవివిధాధ్వరుం డగుచుఁ బ్రీతి ననేకసహస్రవర్షముల్.

274


వ.

మఱియును.

275


ఉ.

ధర్మమున న్ధనంబు సతతంబు ప్రవృద్ధము గా ధనంబున
న్ధర్మము తొంగలింప ధనధర్మవిరోధులు గానికామభో