పుట:మార్కండేయపురాణము (మారన).pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

మనుజకృతతటాకాదుల మన్ను ముద్ద, లైదు పుచ్చక సుస్నాన మాచరింపఁ
జనదు దేవఖాతము లగుసరసులందు, బావులందును నదులందు వలదు వత్స!

257


సీ.

అన్నంబు గోవు మూర్కొన్నఁ గీటక మీఁగ వెండ్రుక లం దున్న విమలభూతి
యుతజలప్రోక్షణ నతిశుద్ధ మగు భసితమునఁ గాంస్యంబు నామ్లమునఁ దామ్ర
మును క్షారమున సీసమును దగరంబు పై పై వారి చల్ల ద్రవనిచయములు
శుద్ధి వహించు రశులు రజోగోవహ్ను లశ్వంబు మారుత మవని నీళ్ళ


తే.

బిందువులు మణికలు గీడుఁ జెందియును బ, విత్రతనె పొందు నెప్పుడు విను మజాశ్వ
వదనములు పక్షికులముఖవిదళితంబు, లై పడినఫలములు శుచు లండ్రు బుధులు.


క.

ఇనశశికరపవనస్ప, ర్శనముల నతిశుద్ధిఁ బొందు శయ్యాయానా
సనయానపాత్రమార్గము, లును దృణమును బణ్యములును లోకస్తుత్యా!

259


ఆ.

అంటఁ గానిదాని నంత్యజుఁ బతితు శ, వంబుఁ బేడి నగ్నుఁ బరవధూప
రాయణుని నధర్మరతు మృతహారకుఁ, జూచి సేయవలయు నాచమనము.

260


ఆ.

కోడి నూరఁబందిఁ బేడిఁ జండాలుని, నక్కఁ గుక్కఁ గృతకనారిఁ బతితు
ననఘ! పిల్లి నెలుక నాశౌచి సూతిక, నంటినతఁడు నీళు లాడవలయు.

261


క.

ఏనరుఁడు సదాచారవి, హీనుం డేనరుఁడు భూసురేంద్రత్యక్తుం
డేనరుఁడు ధర్మబాహ్యుం, డానరుఁ డఘభోక్త యగునరాధముఁడు సుమీ!

262

బ్రాహ్మణాదులయాశౌచప్రకారము

వ.

కావున నిత్యకర్మకలాపంబు ప్రయత్నంబున ననుష్ఠింపవలయు వాని ననుష్ఠింపవల
వనిదినంబులు మరణజన్మంబులందుఁ గల వాకర్ణింపుము.

263


క.

పదిదినములు బ్రాహ్మణులకుఁ, బదియును మఱి రెండు ధరణిపాలురకు నొగి
న్బదియేను వైశ్యులకు ము, ప్పది శూద్రుల కఖిలకర్మబాహ్యత వలయున్.

264


సీ.

ప్రథమచతుర్థసప్తమనవమదినంబు లస్థిసంచయమున కర్హములు చ
తుర్వర్ణులకును జతుర్థాహముల నగు నగ్నివిషంబుల నంబువులను
శస్త్రంబులను ననశనవిధిఁ బ్రాయోపవేశంబునను బరదేశమునను
సన్న్యాసమున బాల్యసమయమునను మృతు లైన సద్యశ్శౌచ మావహిల్లు


ఆ.

ననఘ! మూఁడుదినము లాశౌచ మండ్రు గొం, దఱు మునీంద్రు లతులధర్మయుక్తి
నెన్ని నెలలబాలుఁ డీల్గె నన్నిదినంబు, లశుచిభావ మొందు విశదకీర్తి!

265


వ.

తమతమసూతకదినంబులు చనిన నఖిలవర్ణులును సుస్నాతు లై నిజకర్మంబు లనుష్ఠిం
చునది యివ్విధంబున గృహస్థులు ధర్మార్థకామంబులు పరస్పరవిరోధులు గాకుండ
నవలంబించి సదాచారపరు లై యిహపరసుఖంబులు వడయుదురని మదాలస
బహుప్రకారంబులఁ జెప్పిన కర్మకాండవిధంబు విని యలర్కుం డానందభరితుం
డయ్యెనని చెప్పి వెండియుఁ దండ్రికి జడుం డిట్లనియె.

266