పుట:మార్కండేయపురాణము (మారన).pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

పరదారాగమనంబునం గలుగుపాపం బెక్కు డత్యంతదు
స్తర మాయుఃక్షయ మాచరించు నయుతేష్టాపూర్తము ల్సేసిన
న్హరియించు న్బరలోకము న్యశము నిత్యైశ్వర్యము న్గావున
న్నరుఁ డన్యాంగనపొంతఁ బోవమి గడు న్ధర్మంబు ధర్మాత్మకా!

237


క.

విను నురువును దుర్గంధం, బును లేనిపవిత్రవారిఁ బూర్వముఖుం డొం
డె నుదఙ్ముఖుఁ డొండెను నై, యనఘ! యశబ్ధముగ వార్చునది కడు నియతిన్.

238


సీ.

దంతతాడనమును దనుతాడనము చేఁత నింద్యంబు సంధ్యల నిద్ర గుడుపు
సురతంబు చదువును దురితంబుఁ జేయుఁ బూర్వాహ మధ్యాహ్నా పరాహ్ణవేళ
లమర మనుష్యపిత్రర్చనలకు మేలు క్షౌరకార్యములకుఁ గరము లెస్స
ప్రాగుదఙ్ముఖతలు పరులకు నుపతాప మొనరించుపను లెఫ్డు నుడుగవలయు


తే.

జంతుచయము నొప్పింపంగఁ జనదు కన్యఁ, గులజ నైనను రోగిణి గినఁటిఁ జెనఁటిఁ
బరిణయం బగు టొప్పదు భార్యఁ బ్రీతి, నరసి రక్షించునది తగ దాత్మ నీసు.

239


ఆ.

అంటరానిదాని నఖిలవర్ణులకును, ననఘ! నాల్గురాత్రు లంట రాదు
కొడుకు సమదినమునఁ గూఁతురు విషమది, నమునఁ బుట్టు టెఱిఁగి నడువవలయు.

240


ఆ.

పంచపర్వములను బగలు నంగనఁ బొందు, నతని కుద్భవింతు రధికపాప
యుతులు సుతులు సంధ్యనుగ్మలి నాదటఁ, గూడె నేని యతఁడు వేడిఁ గాంచు.

241


వ.

క్షౌరక్రియాంగనాసంగమావసానవమన శ్మశానప్రదేశంబుల సచేలస్నానంబు
సేయుట గురుద్విజరాజమంత్రిపతివ్రతాతపస్సులయందుఁ బరివాదపరిహాసంబులు
పరిహరించుట యత్యున్నతాతినీచంబు లగుశయనాసనంబులు వర్జించుట ధవళాం
బరకుసుమానులేపనంబులు ధరియించుట మాంగళ్యవేషభాషణంబు లంగీకరించుట
యాచారంబు లని మఱియును.

242


సీ.

మత్తుఁ డున్మత్తుఁ డుద్వృత్తుఁ డసత్త్వుండు దుర్వినీతుఁడు చౌర్యదూషితుండు
లుబ్ధుఁ డతివ్యయలోలుండు శత్రుఁ డబద్ధుండు బంధకీభర్త హీనుఁ
దతిబలవంతుఁడు నతినిష్ఠురుఁడు నింద్యుఁ డనువీరితోడ సఖ్యంబు దగదు
తగు మహీపాలబాంధవబుధదీక్షితస్నాతకాద్యుత్తమజనులతోడ


తే.

ఋత్విగాదుల నార్వుర నెఱిఁగి పూజ, సేయునది యాశ్రయించి విశిష్టభక్తి
నేఁడు గాల ముండిన వారి నెపుడు విడువ, కర్థి రక్షింపవలయు శక్త్యనుగుణముగ.

243


శా.

అంగుష్ఠాంతరరేఖ యాచమనయోగ్య బ్రాహ్మ్యతీర్థంబు సు
మ్మంగుష్ఠంబునఁ జుట్టవ్రేలియెడఁ బిత్ర్యం బైనతీర్థంబు
నంగుళ్యగ్రము దైవతీర్థమునఁ బొల్పారు ఋషిప్రీతి యో
జం గావించుఁ గనిష్ఠి కాద్య మగుప్రాజాపత్యతీర్థం బనన్.

244


తే.

దేవమునిపితృతతికిఁ దత్తీర్థములను, చేయునది కృత్యములు తప్పఁ జేయవలవ
దాభ్యుదయికపితృక్రియ కర్హ మండ్రు, దివ్యమునులు ప్రాజాపత్యతీర్థ మనఘ!

245