పుట:మార్కండేయపురాణము (మారన).pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చిత శ్రాద్ధం బొనరించిన, యతఁ డభిమతసిద్ధిఁ బొందు నమరతఁ బడయున్.

218


సీ.

స్వర్గసౌఖ్యము పుత్త్రసంపద తేజంబు శౌర్యంబు సుక్షేత్రచయము పుష్టి
సుతలబ్ధి వంశముఖ్యత సుభగత్వంబు ప్రకటవిశ్రాణనాపత్యమహిమ
శ్రేష్ఠత సంతానసిద్ధి వాణిజ్యలాభము విశిష్టత సార్వభౌమపదవి
యాధిపత్య మనామయమ్ము యళ మ్మశో, కత పుణ్యలోకంబు కనక మాగ


తే.

మాప్తి వైద్యప్రసిద్ధి యజావివృద్ధి, వనిత రజత మశ్వము లాయు వనఘ కలుగుఁ
గృత్తికాద్యష్టవింశతికీర్త్యతార, లందు శ్రాద్ధంబు నొగిఁ జేయునార్యతతికి.

219


వ.

కావునఁ గామ్యశ్రాద్ధంబు లీనక్షత్రంబులం జేయునది యిట్లు గృహస్థుండు హవ్య
కవ్యంబుల దేవపితృగణంబుల రుచిరాన్నపానంబుల నతిథిబాంధవభృత్యభిక్షు
భూతపశుపిపీలికాదులనుం బరితుష్టి నొందించుచు సదాచారపరుండు గావలయు
ననిన నలర్కుం డాచారప్రకారం బెట్టి దెఱింగింపు మనవుడు మదాలస యి
ట్లనియె.

220

సదాచారప్రకారము

క.

ఆచారము వలయు గృహి క, నాచారుఁ డిందుఁ బరమునందును రెంట
న్నీచత్వంబున నొందు స, దాచారపరుండు పూజ్యుఁ డగు విమలమతీ!

221


క.

దానము దపమును యజ్ఞము, మానుగ సఫలత్వ మొందు మహితాచారా
నూనునకు సదాచారవి, హీనునకు విఫలత నొందు నిద్ధవిచారా!

222


క.

కావున నాచారంబు శు, భావహ మట్లగుట నీవు నవహితమతివై
కావింపు దత్స్వరూపము, శ్రీవిలసితమూర్తి! నీకుఁ జెప్పెద వినుమా.

223


క.

అనుపమవర్గత్రయసా, ధన మహితోద్యోగపరతఁ దనరుగృహస్థుం
డనఘ! యిహాముత్ర లయం, దనవరతాభీష్టసిద్ధి నభిరమ్యుఁ డగున్.

224


సీ.

ఒనరంగ బ్రాహ్మముహూర్తంబునందు మేల్కనుట ధర్మార్థచింతనము సేఁత
సంకల్పితస్నానసంధ్యాజపాగ్నిహోత్రాదినిత్యక్రియ లాచరించు
టాదిత్యు నుదయాస్తమయములఁ జూడమి యనృతంబు వల్కమి యలుక లేమి
యపవాదపురుషవాక్యప్రలాపంబుల నుడుగుట నగ్న యై యున్న యన్య


ఆ.

వనిత నైన నాత్మవనిత నైనను గనుఁ, గొనమి యంటరానివనితదర్శ
నంబు తదభిభాషణంబు మానుట సదా, చార మండ్రు బుధులు జనవరేణ్య!

225


ఆ.

విష్ఠ యుముక పెంకు వెలిమిడి మూత్రంబు, బొగ్గు కేశచయము భూమిసురుల
చేను ప్రాఁత యైనచీర త్రాడూషర,స్థలము గాలఁ ద్రొక్కఁ దగదు పుత్ర!

226


తే.

దర్పణాలోకనము దంతధావనంబు, వెండ్రుకలను గైసేయుట వినుము దేవ
తార్చనము లివి గృహికిఁ బూర్వాహ్ణముననె, యాచరింపంగవలయు గుణాభిరామ!

227


తే.

వార్చి వాఙ్మనోనియతితో వలను గలిగి, యుత్తరంబొండెఁ దూర్పుదిక్కొండె జూచి
జానుమధ్యంబునందు హస్తంబు లుండఁ, గుడుచునది పవిత్రాన్నంబు గుణవరేణ్య.

228