పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/54

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. దీర్ఘకాల అనారోగ్యం తరువాత 1985 డిశెంబర్ 15 న ప్రఖ్యాతి పొందిన ఈ నివాసంలోనే కన్నుమూశారు.

మారిషస్ నాలుగవ గవర్నర్ జనరల్‌గా స్వాతంత్రోద్యమంలో ప్రముఖపాత్ర నిర్వహించి, రామ్‌గులామ్ మంత్రి మండలిలో ఆర్ధికమంత్రిగ పనిచేసిన సర్ వీరాస్వామి రింగడు నియుక్తులైనారు.

లిరిడూబ్ లో ఇటీవల నిర్మించిన జలాశయాలు, పక్షుల కేంద్రము శ్రీ రింగడు ఏర్పరచినవే.

పెద్దగద్దె నెక్కిన తెలుగుపెద్ద

సర్ వీరాస్వామి రింగడు తండ్రి తెలుగువాడు, తల్లి తమిళవనిత. తెలుగు భాషా సంస్కృతులపై ఆయన అపారమైన అభిమానం చూపుతారు. ఆంధ్ర విశ్వ విధ్యాలయం డాక్టరేటుతో తెలుగు బిడ్డడైన సర్‌వీరాస్వామి రింగడును సత్కరించింది.

సర్‌వీరాస్వామి రింగడు 1920 సంవత్సరంలో పోర్టులూయిస్‌లో జన్మించారు. పోర్టులూయిస్ గ్రామర్ స్కూలులోనూ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లోనూ విద్యాభ్యాసం చేసి 1948 లో న్యాయవాది పట్టా పొందారు. 1956 లో పోర్టులూయిస్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఆ తరువాత లెజిస్లేటర్ అసెంబ్లీ సభ్యులై కార్మిక, సమాజరక్షణశాఖామంత్రి(1959-64),విద్యాశాఖామంత్రి(1964-67), వ్యవసాయ, ప్రకృతి వనరుల మంత్రి(1967-68), ఆర్ధికశాఖామంత్రి(1968-82)గా బాధ్యతలు నిర్వహించారు.

1986 జనవరి 17 న గవర్నర్ జనరల్‌గా నియమితులయ్యారు. 70 సంవత్సరాల వృద్దుడైన శ్రీ రింగడు నిరాడంబరుడు, సాధుస్వభావుడు. గార్డెన్ పార్టీకి వెళ్ళిన మాకు ఎదురువచ్చి సాదరంగా ఆహ్వానం పలికారు శ్రీ రింగడు దంపతులు. మా నాన్నగారు గాంధీ ప్రతిమను శ్రీ రింగడుకు బహూకరించారు. మనరాష్ట్రం నుండి వెళ్ళిన కళాకారులతో కూడా ఆయన చాలా కలివిడిగా తిరిగి వారితో ఎంతో ఓపిగ్గా ఫోటోలు తీయించుకున్నారు. మారిషస్ దేశ మంత్రులు, అధికారులు, అనధికారులు వివిధ రంగాల ప్రముఖులు గార్డెన్ పార్టీకి వచ్చారు. తేనీటివిందు పూర్తయ్యాక లిరిడూబ్ వరండాలో మన కళాకారులు ప్రదర్శన లిస్తూంటే పచ్చిక బయళ్ళల్లో గవర్నర్ జనరల్‌తో బాటు వందలాది మంది ప్రముఖులు ప్రదర్శనలను తిలకించటం ఓ మధురానుభూతి.