పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 తెలుగు చలన చిత్ర రంగంలో తిరుగులేని నటీమణిగా ఖ్యాతి గడించి రాజకీయ రంగంలో ప్రవేశించి రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలిగా లోక్‌సభలో అడుగిడి భారత ప్రభుత్వ ఏకైక ప్రతినిధిగా మహాసభలకు అరుదెంచిన శ్రీమతి జమున 'సత్యభామ' ఏకపాత్రాభినయం ఆనాటి ముఖ్యాంశం.

"శ్రీకృష్ణతులాభారం" సినిమాలో ' సత్యభామ'గా ఆంధ్రుల హృదయాల్లో చెరగని ముద్ర వేసి జమునే సత్యభామ-సత్యభామే జమున అన్న భావన కలిగేలా చేశారు. రంగస్థలం మీద సత్యభామ పాత్రాభినయంలో శ్రీ స్థానం వారిది ప్రత్యేక స్థానం. ఆయన స్వయంగా రచించి అభినయించిన 'మీరజాలగలడా నా యూనతి..' పాట తెలుగునాట బహుళప్రసిద్ధి గాంచింది. చివరకు సినిమాల్లో కూడా ఆ పాట చిత్రీకరణ జరిగింది.

ఆ పాటను శ్రీమతి జమున ఆలపించి అభినయించారు. ప్రముఖ రంగస్థల ప్రయోక్త డా॥ గరికపాటి రాజారావు ఆశీస్సులతో రంగస్థల రంగం నుండి సినిమా రంగానికి తరలి వెళ్ళిన శ్రీమతి జమున తన మాతృ రంగమైన రంగస్థలాన్ని మరచిపోవక పోవటం విశేషం. ఆంధ్రప్రదేశ్ రంగస్థల కళాకారుల సమాఖ్య స్థాపించి అధ్యక్షురాలిగా ఉంటూ పేద, వృద్ధ కళాకారులకు ఎనలేని సహాయం చేసింది శ్రీమతి జమున. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ అధ్యక్షురాలిగా నాటక రంగ అభివృద్ధికి కృషి జరిపింది. తాను 'సత్యభామ' పాత్ర ధరించి శ్రీకృష్ణతులాభారం నాటకం ప్రదర్శించి సమాఖ్యకు ఆర్ధిక సంపత్తి సమకూర్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించింది.

సత్యభామలో సాక్షాత్కరించే స్వాభిమానం, సాహస ప్రవృత్తి జమునలో కానవస్తాయి. జమున అభినవ సత్యభామై తన నటనా చాతుర్యంతో మారిషస్ గవర్నర్ జనరల్ తదితర ప్రముఖుల ప్రశంసలను అందుకుంది.

గోపాలరాజ్ భట్ బృందం 'నెమలి నృత్యం', సంపత్ కుమార్ 'జాలరి నృత్యం', ఆచంట వెంకటరత్నం నాయుడు దుర్యోధనుడి ఏకపాత్రాభినయం, మిద్దేరాముల బృందం 'ఒగ్గు కధ' ఆనాటి కార్యక్రమాల్లో ముఖ్యాంశాలు.

గవర్నర్ జనరల్ శ్రీ వీరాస్వామి రింగడు కళాకారులను విడివిడిగా అభినందించి ఫోటోలు తీయించుకున్నారు. గార్డెన్ పార్టికి మా మారిషస్ మిత్రుడు శ్రీ త్యాగరాజ సోకప్పడు వచ్చాడు. శ్రీ త్యాగరాజు మారిషస్ నుంచి వచ్చి విజయవాడ లయోలా కాలేజీలో చదివి పట్టభద్రుడైనాడు. మాకు అత్యంత ఆప్తులు, బంధువులు అయిన విజయవాడ వాస్తవ్యులు శ్రీ అర్జారామారావుగారి అమ్మాయి లక్ష్మిని వివాహమాడాడు.