పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పెట్టి అరటి చెట్లని ఇరువైపుల ఉంచి అలంకరించారు. దాని ఎదుట దీపపుకుందులు ఉంచి మంత్రోచ్ఛారణల మధ్య వాటిని వెలిగించారు. వేదిక వెనుక భాగాన తృతీయ ప్రపంచ తెలుగు మహాసభలు అని ఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఉన్న బంగారు రంగులో ఉన్న శాటిన్ బ్యానర్ కట్టారు.

మహాసభలకు విచ్చేసిన ప్రతినిధులు, మారిషస్ దేశపు మంత్రులు, స్పీకరు, పార్లమెంటు సభ్యులు, వివిధ నగరాల మేయర్లు, భారత హై కమిషనర్, అధికార ప్రముఖులు తమతమ ఆసనాలలో కూర్చుని ప్రారంభ సుముహర్తం కోసం వేచి చూడసాగారు.

సరిగ్గా 9-30 గంటలకు మారిషస్ గవర్నర్ జనరల్ సర్‌వీరాస్వామి రింగడు, ప్రధానమంత్రి సర్ అనిరుద్ జగన్నాథ్ విచ్చేశారు. వారిని మంగళ వాయిద్యాల నడుమ స్వాగతం పలుకుతూ వేదిక మీదకు తీసుకుని వచ్చారు.

దేవతారాధన సమయంలోనూ, వివిధ శుభ కార్యక్రమాల సందర్భంగానూ కొన్ని వందల ఏళ్ళ నుండి ఆంధ్ర దేశంలో అనూచానంగ ఉపయోగిస్తున్న నాదస్వర వాయిద్యాన్ని మారిషస్ వారు గుర్తు పెట్టుకుని ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏర్పాటు చేయడం హర్షించ తగిన విషయం.

మారిషస్ తెలుగు ఆడపడుచులు 'మా తెలుగు తల్లికి మల్లె పూదండ' అనే ప్రార్ధనాగీతం ఆలపిస్తూండగా సభాకార్యక్రమాలు మొదలయ్యాయి. ఆ తరువాత వేద మంత్రాలు పఠించటం జరిగింది.

మారిషస్ ఆంద్ర మహాసభ అధ్యక్షులు శ్రీ పుష్పరాజ్ సూరయ్య "మా పిలుపు స్వీకరించి వచ్చినందుకు మా హృదయ పూర్వక కృతజ్ఞతలు' అంటూ స్వాగతం పలికి సభారంభం చేశారు.

అటు పిమ్మట శ్రీ సూరయ్య మారిషస్ తెలుగు వారి వలస, ప్రస్తుత స్థితి గతులు వివరించి, 1981లో మలేషియాలో జరిగిన ద్వితీయ ప్రపంచ తెలుగు మహాసభలో తీసుకున్న నిర్ణయాన్ని మారిషస్ ప్రభుత్వ సహకారంతో ఈ నాటికి నెరవేర్చగలిగామని ఆనందాన్ని ప్రకటించారు.

150 సంవత్సరాల క్రితం వివిధ దేశాలకు పలురకాల కారణాల వలన వలస వెళ్ళిన తెలుగు వారు తమ మాతృభాష నిలుపుకునే కృషిని తెలుసుకునేటందుకు ఈ మహాసభలు సహకరిస్తాయని అన్నారు.

మారిషస్ ప్రధాని మాన్య శ్రీ అనిరుద్ జగన్నాధ్ మహాసభలను లాంఛనంగా