పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రారంభిస్తూ -'వివిధ దేశాల నుండి పెద్ద సంఖ్యలో వ్యయప్రయాసల కోర్చి మహాసభలో పాల్గొనేటందుకు పెద్ద సంఖ్యలో ప్రతినిధులు తమ దేశం తరలి వచ్చినందుకు ఆనందాన్ని వ్యక్త పరిచారు. తెలుగు భాష గొప్పతనాన్ని ఇది చాటుతుందని ఆయన అన్నారు. మారిషస్ దేశ ప్రగతికీ, అభ్యున్నతికీ తెలుగు వారు చేసిన అసమాన కృషిని ఆయన ప్రస్తుతించారు.

తెలుగు భాషా సంస్కృతుల అభ్యున్నతికి తమ దేశం పూర్తి తోడ్పాటు నందిస్తుందని తెలిపారు. మారిషస్‌లో హిందీ మాట్లాడే వారి స్థానంతరువాత తెలుగు వారిదేనని వెల్లడించారు. మారిషస్‌లో విభిన్న మతాలూ, భిన్నమైన సంస్కృతులూ, జాతులకు చెందిన ప్రజలు నివశిస్తున్నారని, వారి వారి భాషా సంస్కృతులను కాపాడు కోవటానికి వారు చేసే ప్రయత్నాలకు తమ ప్రభుత్వం తగు ప్రోత్సాహం ఇస్తుందని చెప్పారు.

తెలుగు వారు జరుపుకునే తెలుగు సంస్కృతికి దర్పణమైన 'మహారామ భజనం', 'సింహాద్రి అప్పన్న పూజ' 'అమ్మోరి' పండుగలకు ప్రభుత్వ పరంగా సహకారం లభిస్తుందని చెప్పారు. 1950 సంవత్సరపు మారిషస్ ప్రభుత్వ విధానానుసారం దేవాలయ నిర్మాణానికి సబ్సిడీలూ, పండుగలకు ప్రోత్సాహాలు మాతృభాషల అభ్యాసానికి బోధనావకాశాలను కల్పించి సంస్కృతీ పరిరక్షణకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ప్రధాని చెప్పారు.

భారతీయ సంస్కృతీ-సాంప్రదాయాలు మహోన్నత మైనటువంటివని ఆయన కీర్తిసూ హిందూ సంస్కృతి కాలాన్ని అవరోధాన్ని అధిగమించి నిరంతర ప్రవాహంగా సాగుతుందని, ఇతర సంస్కృతులతో పాటు శక్తివంతమై అన్ని సంస్కృతులను గౌరవించే మారిషస్ సమాజ స్థాపనకు హిందూ సంస్కృతి దోహదకారైందని అన్నారు.

భారతీయ సంస్కృతీ వైభవ విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ తెలుగు వాడు కావటం తెలుగు వారి గొప్పతనానికి నిదర్శనం అని ప్రధాని శ్రీ జగన్నాధ్ అభిభాషించారు.

తెలుగు మహాసభలు మారిషస్‌లోని విభిన్న సంస్కృతీ విధానాన్ని మరింత పెంపొందించి శాంతియుత సౌభ్రాతృత్వ సహజీవనానికి తోడ్పడి ప్రపంచ వ్యాప్తంగా మారిషస్‌కి ఉన్న ఖ్యాతిని దృఢపరుస్తాయన్న ఆశాభావాన్ని ప్రధాని శ్రీ జగన్నాద్ వ్యక్తం చేశారు.