పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 మారిషస్‌లో జనప్రియమై న పండుగ అమ్మోరిపండుగ. అమ్మోరి పండుగను తెలుగు వారందరూ కలసి మెలసి చేసుకుంటూంటారు. మన పల్లెటూళ్ళల్లో గ్రామ దేవత సంబరాలను తలపింప చేసే పండుగ ఈ అమ్మోరి పండుగ.

పోశమ్మ ,ఎల్లమ్మ, పెద్దమ్మ, బాలమ్మ, మాచికమ్మ, ఈదమ్మ, మహంకాళమ్మ అనే ఏడుగురి దేవతా సోదరీమణుల పేరు మీదుగా ఈ అమ్మోరి పండుగ చేస్తారు. ఈ దేవతలు పొంగు, మశూచి వ్యాధులు రాకుండా కాపాడతారని, ఆరోగ్యాన్ని సౌభాగ్యాన్ని ప్రసాదిస్తారని మారిషస్ తెలుగు వారి ప్రధాన నమ్మకం.

పూర్వ కాలంలో ఈ అమ్మోరు పండుగ పెద్ద ఎత్తున చేసేవారట. ప్రభలు కట్టేవారు, ఘటాలు యిచ్చేవారు, కోడి పుంజులు, మేకపోతులు తీసుకు వచ్చి అమ్మోరు గుడి ఎదుట బలి ఇచ్చేవారు. తదనంతరం అక్కడే పొయ్యిలు పెట్టి మాంసాహారం వండుకుని భుజించి మద్యం త్రాగి జాతర చేసుకునే వారు. రాను రాను త్రాగుడు మత్తు ఎక్కువై తగాదాలు పడటం, కొట్టు కోవటం జరిగేదట.

1984-85 సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల సంఘం వారు బలి ప్రభని ఖండిస్తూ తీవ్ర ప్రచారం చేసి దానిని మాన్పించారు. ఇప్పుడు మేకపోతుల బదులు గుమ్మడి కాయలను బలి పెడుతున్నారు. మాంసాహారం బదులు గారెలు, బూరెలూ వండుకుని పండుగ చేసుకుంటున్నారు.

అమ్మోరు పండుగ విధానం విన్న నాకు మా అవనిగడ్డలో జరిగే లంకమ్మ సంబరం గుర్తుకు వచ్చింది. దానికీ-దీనికీ ఏం తేడా లేదు. తెలుగు వారు ఎక్కడున్నా వారి ఆచార వ్యవహారాలు ఒకటేనని ఈ అమ్మోరు పండుగ నిరూపిస్తోంది.

శ్రీ వెంకటేశ్వర దేవాలయం

డిశెంబరు 9 వ తేదీ ఆదివారం మూ కార్యక్రమం లాలెరా, సెంట్‌ఫియరీలో నిర్మించ బడుతున్న శ్రీ వెంకటేశ్వర దేవాలయ సందర్శనతో ప్రారంభం అయ్యింది. ఆ క్రితం రోజే శ్రీ వెంకటేశ్వర దేవస్థానం ట్రస్టు కార్యదర్శి శ్రీ మహానంద రామయ్య మమ్మల్ని తప్పక రావలిసిందిగా కోరారు. లాలోరా గ్రామంలో ఒక ప్రక్క బారులు తీరిన కొండలూ, చెరుకు తోటలతో చూడ మనోహరంగా ఉంది.

మోకా పర్వత శ్రేణుల ప్రక్కన సుందర ప్రదేశంలో ఏడుకొండల వాని దేవాలయ నిర్మాణార్ధం దివ్య జీవన సంఘానికి చెందిన స్వామి వెంకటేశానంద స్థల నిర్ణయం చేశారు. ఆ స్థలాన్ని శ్రీ హెచ్. పులెనా దంపతులు దానం చేశారు. 1977 లో నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. శ్రీ భూపేంద్ర ఏ.దేశాయ్ అధ్యక్షునిగా,