పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ రామయ్య కార్యదర్శిగా ఏర్పడిన ట్రస్టు బోర్డు నిర్మాణాన్ని పర్యవేక్షిస్తుంది.

ఈ దేవాలయ నిర్మాణానికి వడ్డీ లేకుండా ధన సహాయం చేసేటందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ముందుకు వచ్చింది. అయితే భారత విదేశీ మారక ద్రవ్య నిబంధనలు అడ్డంకిగా నిలిచాయి. ఆ సాయాన్ని తమకు చేరేలా తోడ్పడమని శ్రీ రామయ్య మమ్మల్ని ఆర్ధించారు.

స్వదేశం తిరిగి వచ్చాక నాన్నగారు ఈ విషయాన్ని ప్రధానమంత్రి శ్రీ చంద్రశేఖర్ దృష్టికి తీసుకుని వెళారు. కానీ రిజర్వు బాంక్ ఆ అభ్యర్ధనని త్రోసి పుచ్చింది.

లాలౌరా లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన రిసెప్షన్‌కు ప్రధానమంత్రి శ్రీ అనిరుద్ జగనాధ్ హాజరుకావటం విశేషం. ఆనాటి సమావేశంలో డా॥ సి.నారాయణరెడ్డి, శ్రీ మండలి వెంకట కృష్ణారావు, ప్రధానమంత్రి శ్రీ అనిరుద్ జగనాధ్ ప్రసంగించి శ్రీ వెంకటేశ్వేర స్వామి దేవాలయ నిర్మాణం పట్ల ఆనందాన్ని వ్యక్త పరిచారు.

శ్రీ రామయ్య స్వాగతం చెప్పగా, శ్రీ రాజు, బి. ముల్లయ్య కార్యక్రమం నిర్వహించారు.

విష్ణు మందిరం రిసెప్షన్

లాలౌరా నుంచి సెంట్‌ఫయరీలో ఉన్న విష్ణు మందిరంలో జరిగిన రిసెప్షన్‌కి హాజరయ్యాం. తెలుగు వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సెంట్‌ఫీయరీలో అల్మాసుగర్ ఎస్టేట్‌లో పెద్ద సంఖ్యలో పని చేస్తున్న తెలుగు వారు 1920 లో స్థలాన్ని కొని విష్ణు మందిర నిర్మాణం తలపెట్టారు. 1923 మే 20వ తేదీన దేవాలయ ప్రవేశం జరిగింది. అక్కడ నివసిస్తున్న తెలుగు వారు వైష్ణవులు కావటంతో దానికి విష్ణు మందిరం అని పేరు పిలూరు. ఆనాటి కార్యక్రమంలో శీ మండలి వెంకట కృష్ణారావు, శ్రీమతి జమునా రమణారావు ప్రసంగించి తెలుగు మహాసభల ప్రాముఖ్యం వివరించారు. ఆంధ్ర జనతా సహాయ సంఘం వారు విష్ణు మందిరంలో మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు.

సంబరంతో కదిలిన జనవాహిని

రోజ్‌హిల్ చాలా అందమైన నగరం. ఆ నగరాన్ని చూస్తూంటే ఎంతో కళాత్మకంగా సినిమా సెట్టింగ్ లా అనిపించింది. చాలా పరిశుభ్రమైన నగరం. అందమైన భవంతులు. వాణిజ్య సముదాయాలతో ఎంతో ఆకర్షణీయంగా ఉంది.