పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాత్రిపూట తెలుగు అక్షరాలు దిద్దుకుంటున్నారు. తెలుగు వారి ఐకమత్యానికి, సంఘజీవనానికి దేవాలయాలు కేంద్రాలు. మారిషస్‌లో తెలుగు వారికి సంబంధించి దాదాపు యాభై దేవాలయాలు ఉన్నాయి.

మారిషస్‌లో తెలుగు పండుగలు

150 సంవత్సరాల క్రితం మారిషస్‌కి వలస వెళ్ళిన తెలుగు వారిలో రామభక్తులు 'రామభజనం, శ్రీ నరశింహస్వామి భక్తులు ' సింహాద్రి అప్పన్న పూజ శ్రీ వెంకటేశ్వరస్వామి భక్తులు 'గోవిందపూజ చేసేవారట.

ప్రారంభంలో రామభజనం చేసేవారు ఒక మట్టి దీపం వెలిగించి కీర్తనలు, భజనలు చేస్తూండేవారట. వారిలో శ్లోకాలు, మంత్రాలు తెలిసిన వారుంటే వారిని గౌరవ సూచకంగా 'దాసులనో, "అయ్యోరు' లనో పిలిచేవారు. ఐదారుగురు కలసి భజన గుంపుగా ఏర్పడి రామభజనం తెల్లవార్లు చేసేవారు. తెల్లవారిన తరువాత మట్టి దీపాలను నదిలో విసర్జించేవారు. అలా మొదలైంది రామభజనము.

మారిషస్‌లో ఉన్న తెలుగు వారిలో అధికులు విశాఖపట్నం చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి వచ్చారు. వారు సింహాచల శ్రీ వరాహ నరశింహస్వామి భక్తులు శ్రీ నరశింహస్వామిని వారు 'సింహాద్రి అప్పన్న' అని భక్తితో పిలుచు కుంటారు. సింహాద్రి అప్పన్న పూజలో విశేషమేమిటంటే మండుతున్న కోలాళ్ళు తీసుకుని భక్తితో నృత్యమాడటం. "హరి హరి నారాయణా .. ఆది నారాయణా.. కరుణించు మమ్మేలు కమలలోచనుడా!" అంటూ వారు భక్తి పారవశ్యంతో వెలుగుతున్న కోలాళ్ళు పట్టుకుని ఆడతారు. తెల్లవార్లు అప్పన్న పూజ చేసి తెల్లవారిన తరువాత కోలాళ్ళ లోని జ్యోతిని నదిలో నిమజ్జనం చేసి ఇంటికివచ్చి గుమ్మడికాయని పగలగొట్టి శాంతి పాఠం చెప్పి ప్రసాదం పంచి పెడ్తారు. కోలాళ్ళు పట్టుకునే మనిషి నలభై రోజులు నిష్టతో కొన్ని నియమాలు పాటించాలి.

మద్రాసు, తిరుపతీ ప్రాంతం నుంచి వచ్చిన వారు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు. వీరు 'గోవిందపూజ' ఆచరించేవారు. అయితే ఈగోవిందపూజ మారిషస్‌లో అంతగా ప్రాచుర్యం పొందలేదు. ఈమధ్యకాలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల సంఘం వారు సనాతన ధర్మ ప్రచారం చేస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి పూజా వ్రతాదులను పాటిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణంలో ఉంది. (ఆ విషయం మున్ముందు వివరిస్తాను.)