పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భజనము. భక్తితో ఆచరించడానికి అక్కడ చేరిన వేలాది మంది జనసందోహాన్ని చూసి పులకించని హృదయం ఉండదు.

ఏనాడో ఆంధ్ర దేశంలోని పల్లె సీమల్లో వర్ధిల్లిన రామభజనము ఈనాడు మాతృదేశంలో మాయమైనా మారిషస్‌లో వర్ధిల్లటం చూసి ఏ తెలుగు హృదయం గర్వించదు?

మారిషస్ ప్రభుత్వం వారు పదివేల మంది కూర్చోవడానికి వీలుండే విధంగా పెద్ద సర్కస్ గుడారం లాంటిది వేశారు. ఆ గుడారం మధ్య ఆకర్షణీయమైన ఇత్తడి దీపపు వృక్షాలు (సెమ్మెలు) అలంకరించి వెలిగించారు. బృందాలవారీగా ఒక్కొక్క సెమ్మ చుట్టూ చేరి ముందు లక్ష్మీ పూజ గావించి భజనకు ఉపక్రమించారు. రామభజనతో పాటు చిటి తాళాలతో రామదాసు కీర్తనలు, నరశింహ, వేమన శతక పద్యాలను పాడుతూ తెల్లవార్లు గడుపుతారు.

ప్రపంచ తెలుగు మహాసభల ఎంబ్లెమ్ ముద్రించిన బనీన్లు ధరించి మోకాలి వరకు పంచెకట్టు కట్టి తాళాలు చేత పట్టి వారు భజన చేస్తూంటే సంస్కృతీసాంప్రదాయాల పట్ల వారికి ఉన్న మక్కువ నన్నెంతో ముగ్ధుణ్ణి చేసింది.

వారి పంచెకట్టు దసరా బుల్లోడు చిత్రంలో నాగేశ్వరరావుగారి పంచెకట్టు పద్దతిలో ఉంది. నా ప్రక్కన కూర్చున్న నాగేశ్వరరావుగారితో అదేమాట అన్నాను.

మహారామ భజనము డిశంబరు 8వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై 9 వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటలకు ముగిసింది. 12 గంటలపాటు నిర్విరామంగా జరిగిన మహారామ భజనంలో దాదాపు 10 వేల మంది తెలుగువారు పాల్గొన్నారు. మారిషస్ నలుమూలల నుండి ప్రత్యేక బస్సులలో వారక్కడకు వచ్చారు. మహారామ భజనానికి వచ్చిన 10 వేల మందికి అరటి ఆకులలో షడ్రసోపేతమైన తెలుగు భోజనం పెట్టడం ఒక విశేషం.

బియోవాలన్ సింహాద్రి అప్పన్న దేవాలయం

బియోవాలన్ లో మహారామ భజన జరుగుతున్న ప్రదేశానికి ఎదురుగా రోడ్డుకి ఆవలి ప్రక్కన సింహాద్రి అప్పన్న దేవాలయం ఉంది. మారిషస్ తెలుగు వారు నిర్మించుకున్న ప్రాచీన దేవాలయాలలో ఇదొకటి.

దేవాలయాల చుట్టూరా మారిషస్ తెలుగు వారి సాంఘిక జీవనం అల్లుకుని ఉంది. తెలుగు వారు ఒకరినొకరు కలుసుకుని ఆత్మీయతానుబంధాలు పెంచుకునేందుకు దేవాలయాలు తోడ్పడుతున్నాయి. గుడిని బడిగా మార్చుకుని