పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆడపడుచులు పుష్పగుచ్ఛాలు అందిస్తూహృదయపూర్వకమైన స్వాగతం పలికారు. మాకు స్వాగతం పలకటానికి వచ్చిన మారిషస్ మంత్రి శ్రీ మహేన్ ఉచ్చన్న తెలుగు వాడు కావటం మాకెంతో గర్వం అనిపించింది. ఆయన మారిషస్ ప్రభుత్వంలో ఇంధన జల వనరుల మరియు పోష్టల్ సర్వీసుల మంత్రిగా ఉన్నారు. మహాసభల స్టీరింగ్ కమిటీకి ఆయన ఉపాధ్యక్షుడు కూడా. మారిషస్ ఆంధ్ర ప్రముఖుడు శ్రీ రమణగారి కారులో డా॥ సి.నారాయణరెడ్డి, నేను, మా నాన్నగారూ కలిసి హోటల్ కి బయలుదేరాం.

మారిషస్ దేశపు అందాలు తిలకిస్తూ- ముచ్చట్లు చెప్పుకుంటూ కారులో వెడుతున్నాం.

అంతర్జాతీయ తెలుగు సంస్థ అధ్యక్షులుగా మా నాన్నగారు మలేషియాలో ఆంధ్ర భాషా ప్రచారానికి ప్రముఖ కవులు డా॥ దాశరధి, డా॥ సి.నారాయణరెడ్డిగార్లను 1977 లో పంపించారు. -

అదే డా॥ నారాయణరెడ్డి గారి తొలి విదేశ పర్యటన. అది గుర్తు చేస్తూ. ఆ తర్వాత నేను చాలా దేశాలు ప్రపంచ వ్యాప్తంగా తిరిగాను కాని. మలేషియా పర్యటన కలిగించిన అనుభూతి, ఆనందం మరపురావంటూ చెప్పారు. "మలేషియా తిలకించితిని-మరీ మరీ పులకించితిని" ఆనాడు వారు వ్రాసిన కవిత నేను గుర్తుకు తెచ్చాను.

హరిచాప శకలాలు - ఆనంద శిఖరాలు

ప్రపంచంలో అత్యంత సుందరమైన ద్వీపాలలో మారిషస్ ఒకటి అని ఎవరైనా అంగీకరించ వలసిందే. ఇంద్రధనస్సు రంగులలో రమణీయంగా కనిపించే ఆకాశం, ధవళ కాంతులతో పగడపు సైకత సముద్రతీరాలు, వాటి అంచుల్లో కొబ్బరిచెట్టు, సరుగుడు తోటలు ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. చూపరులకు కనువిందు చేస్తాయి.

ఇతర హిందూ మహాసముద్రపు దీవుల వలెనే మారిషస్ కూడా సముద్రంలో అగ్ని పర్వతాలు పేలడం వలన ఏర్పడింది. ఈ అగ్ని పర్వతాల శిలలు రెండు యుగాలకు చెందినవి. మొదటిది 130 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన ప్రాచీన లావాగానూ, రెండవది 22 మిలియన్ సంవత్సరాల మధ్యకాలంలో ఏర్పడిన నవీన లావాగానూ చరిత్రకారుల భావన.