పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 అదృష్టవశాత్తు డా॥ సి. నారాయణరెడ్డిగారు తెలుగు విశ్వ విద్యాలయ ఉపాధ్యక్షులైనారు. ఆయన జగత్ర్పసిద్ధ తెలుగు కవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. ప్రథమ, ద్వితీయ ప్రపంచ తెలుగు మహాసభలలో ఆయన ప్రముఖ పాత్రధారి. అంతేకాకుండా అనేక పర్యాయాలు విదేశీ పర్యటనలు విస్తృతంగా చేసిన వారగుట వలన విదేశాంధ్రుల సమస్యలు తెలిసిన వారగుటచే సహజసిద్ధంగా మారిషస్‌లో తెలుగు మహాసభల నిర్వహణకు తెలుగు విశ్వవిద్యాలయ పక్షాన సానుకూలత చూపి అండగా నిలిచారు.

తెలుగు మహాసభల పట్ల మక్కువలేని ముఖ్యమంత్రి డా॥ చెన్నారెడ్డిని మొత్తానికి ఒప్పించి రంగంలోకి దింపి మారిషస్ మహాసభలకు వెళ్తున్నానని ప్రకటింపజేయడంలో డా॥ సి. నారాయణరెడ్డి కృతకృత్యులైనారు.

అంతేకాకుండా మహాసభల ఏర్పాటు నిమిత్తం రాష్ట్రప్రభుత్వం ఒక స్టీరింగ్ కమిటీ ఏర్పరిచింది. దీనికి అధ్యక్షులు ముఖ్యమంత్రి డా॥ మర్రి చెన్నారెడ్డి, ఆర్ధిక మంత్రి శ్రీ కె. రోశయ్య, సాంస్కృతిక వ్యవహారాల శాఖామంత్రి శ్రీమతి గీతారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ వి.పి. రామారావు సభ్యులు. సాంస్కృతిక వ్యవహారాల శాఖ డైరెక్టర్ సి.వి. నరసింహారెడ్డి సమన్వయాధికారి.

స్టీరింగ్ కమిటీ రాష్ట్రంలోని కొంతమంది తెలుగు ప్రముఖులను, పరిశోధకులను, కవులను, కళాకారులను మారిషస్ పంపేటందుకు నిర్ణయించింది. అలా పంపబడేటందుకు నిర్ణయించిన ప్రముఖులలో ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్, సాహితీవేత్త డా॥ బెజవాడ గోపాలరెడ్డి, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, సంఘ సేవా నిరతులు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య, ప్రథమ, ద్వితీయ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వాహకులు శ్రీ మండలి వెంకట కృష్ణారావు ప్రభృతులు వున్నారు.

వారితోపాటు ఆరుద్ర వంటి పరిశోధకులు, వివిధ విశ్వ విద్యాలయాల ఆచార్యులు, కవులు సదస్సులో పాల్గొనటానికి ఆహ్వానింపబడ్డారు. ప్రభుత్వ ఆహ్వానాన్ని మన్నించి వారు మారిషస్‌లో తాము సమర్పించవలసిన ప్రసంగ వ్యాసాలను సిద్ధపరచుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం వారు వారికి కావాల్సిన పాస్‌పోర్టులు, విమాన టిక్కెట్టు సిద్దం చేసే పనిలో నిమగ్నమై వున్నారు.

ఇంతలో హఠాత్తుగా ముఖ్యమంత్రి డా॥ చెన్నారెడ్డి తాము మారిషస్‌కి వెళ్ళటం లేదని, మంత్రులుగాని, ఇతరులుగాని వెళ్ళనక్కరలేదని నిర్ణయం తీసుకున్నారు. దానితో తొలుత ఆహ్వానించిన పెద్దలకు, పండితులకు రానక్కర్లేదని ప్రభుత్వ నిర్ణయాన్ని టెలిగ్రాముల ద్వారా తెలిపారు.