పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/16

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నిర్వహణకు కావలసిన సహాయం ఆంధ్ర ప్రభుత్వ పక్షాన అందిస్తామని శ్రీ రామారావు హామీ ఇవ్వడం జరిగింది.

ఇది జరిగిన కొద్ది దినాలకే డా॥ కృష్ణంరాజు స్వర్గస్థులు కావటంతో సమన్వయ లోపం ఏర్పడింది. 1990 లో మారిషస్‌లో మహాసభల నిర్వహణకు నేషనల్ ఆర్గనైజేషన్ కమిటీ, మారిషస్ విద్యా కళా సాంస్కృతిక శాఖామంత్రి గౌ॥ శ్రీ ఆర్ముగం పరశురామన్ అధ్యక్షులుగా, మారిషస్ ప్రధానమంత్రి గౌ॥ సర్ అనిరుద్ జగన్నాద్ గౌరవాధ్యక్షులుగా, గవర్నర్ జనరల్ గౌ॥ సర్ వీరాస్వామి రింగడు పోషకులుగా, మారిషస్ ఆంధ్ర మహాసభ అధ్యక్తులు శ్రీ పూసరాజ్ సూరయ్య ప్రధాన కార్యదర్శిగా ఏర్పాటైంది.

దీంతో మారిషస్ ప్రభుత్వం పూర్తిగా తృతీయ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు ముందుకు వచ్చినట్లయింది.

1990 డిసెంబరు 10వ తేదీ నుండి 13వ తేదీ వరకు మారిషస్‌లోని మోకానగరంలోని మహాత్మాగాంధీ ఇన్‌స్టిట్యూట్‌లో మహాసభలు జరుపుటకు నిర్ణయించారు.

చరిత్ర పునరావృతం

ఆంధ్రప్రదేశ్‌లో డా॥ మర్రి చెన్నారెడ్డిగారినాయకత్వాన నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మారిషస్ ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు శ్రీ పూసరాజ్ సూరయ్య, శ్రీ ఎన్. రమణ, శ్రీమతి గీతాంజలి హైదరాబాద్ వచ్చి చెన్నారెడ్డిగారిని కలిశారు.

మారిషస్‌లో తెలుగు మహాసభల ఏర్పాటు గురించి వివరించి, మారిషస్ ప్రధాని శ్రీ అనిరుద్ జగన్నాద్ ముఖ్యమంత్రి డా. చెన్నారెడ్డిని మహాసభలకు ఆహ్వానిస్తూ పంపిన సందేశాన్ని అందించారు.

ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ముచ్చటించుకోవలసిన అవసరం వుంది. 1975లో జరిగిన ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల తీర్మాన ఫలితంగా ఏర్పాటైన అంతర్జాతీయ తెలుగు సంస్థను 1983లో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి శ్రీ ఎన్.టి. రామారావు తాను కొత్తగా ఏర్పరిచిన తెలుగు విశ్వ విద్యాలయంలో విలీనం చేశారు. అంతర్జాతీయ తెలుగు కేంద్రం పేరిట అది తెలుగు విశ్వ విద్యాలయంలో ఒక ఉపాంగమైంది.