పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 డా॥ చెన్నారెడ్డిగారి ఆకాల ఆగ్రహానికి ఒక కారణముందని అంటూరు. శ్రీ నేదురుమల్లి జనార్దనరెడ్డిగారు ఉన్నత విద్యాశాఖామంత్రి (శాసనసభా నాయకత్వానికి డా. చెన్నారెడ్డితో శ్రీ జనార్దనరెడ్డి పోటీపడ్డారు) ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో సమభాగం వహించే తెలుగు విశ్వ విద్యాలయం శ్రీ జనార్దనరెడ్డిగారి ఆధీనంలో ఉన్నత విద్యాశాఖ క్రింద వుంది. అయితే స్టీరింగ్ కమిటీలో శ్రీ జనార్దనరెడ్డిగారికి స్థానం లబించలేదు. దానిపై శ్రీ జనార్దనరెడ్డి ముఖ్యమంత్రికి నిరసన తెలపటంతో ఆ కోపం మహాసభలపై చెన్నారెడ్డి చూపారని ఒక కథనం. పెద్దఎత్తున ఏర్పాట్లలో వున్న మారిషస్ ఆంధ్రులకు ఈ వార్త అశనిపాతం అయ్యింది. వారు మ్రాన్పడిపోయారు. అంతులేని నిరుత్సాహానికి గురయ్యారు.

"మొగుడు కొట్టినందుకు కాదు కాని తోటికోడలు దెప్పినందుకు" అన్న చందాన పరభాషల వారి ముందు అవమానభారంతో తలవంచుకోవలసిన పరిస్థితి దాపురించిందని బాధపడ్డారు వారు. -

అయితే పట్టువదలనివిక్రమార్కుడిలా డా॥ సి. నారాయణరెడ్డిగారు ప్రయత్నించి సాంస్కృతిక బృందాలను మాత్రం తీసుకుని వెళ్ళటానికి మాత్రం ప్రభుత్వ అంగీకారం సాధించగలిగారు.

ప్రతినిధి బృందానికి డా॥ నారాయణరెడ్డిగారినే నాయకత్వం వహించమని ప్రభుత్వం కోరింది.

ఇది యిలా వుండగా శ్రీ మండలి వెంకట కృష్ణారావుగారిని మారిషస్ మహాసభలలో పాల్గొనమని ప్రభుత్వం ఆహ్వానం పంపినప్పడు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయన తొలుత ఉత్సాహం చూపించలేదు.

ఎప్పడైతే ప్రభుత్వ నిర్ణయం మారిందో పిలిచి అవమానించినట్లయింది. ఈ వార్త విన్న శ్రీ మండలి మిత్రులు ఎలాగైనా మీరు వెళ్ళి తీరాలని పట్టుబట్టారు. మారిషస్ నుంచి ఆంద్ర మహాసభ అధ్యక్షుడు శ్రీ సూరయ్య మీరైనా రాకపోతే ఎట్లాఅని ఫోన్ చేశారు. మీరు లేకుండా తెలుగు మహాసభలేమిటని ప్రోత్సహించిన మాజీ మంత్రి డా॥ సిహెచ్ దేవానందరావుగారు, మరికొందరు మిత్రులు టిక్కెట్టు తెచ్చి మీరు వెళ్ళి రావలసిందేనని పట్టుబట్టారు.

అవనిగడ్డలో వున్న నాకు పరిస్థితి ఫోన్ ద్వారా వివరించారు. మా నాన్నగారి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా విదేశాలకు ప్రయాణం చేయడం మా కుటుంబ సభ్యులకు సుతారమూ ఇష్టం లేదు.