పుట:మాటా మన్నన.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేడియోలో ఒకరు మాట్లాడిన తర్వాత మరిఒకరు మాట్లాడుతుంటే వినటం మనకెంతో ఇంపుగా ఉంటుంది. అక్కడకూడా చర్చలలో పాల్గొని నెమ్మదిగా, శాంతంగా ఒకరి అభిప్రాయాలను మరిఒకరు విమర్శించుకుంటారు. వాదాలతో దిగి త్వం శుంఠంటే త్వం శుంట అనుకోవటం మంచిది కాదు.

ఎదటి మనిషిని మాట్లాడనివ్వడం మర్యాద. అవతల వ్యక్తి సిగ్గుపడుతున్నప్పుడు దానిని పోగొట్టి మాట్లాడటానికి ప్రోత్సహించాలి. నీ సంగతి నీవు చూచుకోవటం మంచిదికాదు. ఎదుటివారి సంగతి గమనించటం మంచిది.

త్రికరణశుద్ధి, మర్యాద ఉండటం మంచిది. ఆత్మవంచన, పరవంచన మంచిది కాదు.

ఇతరుల ఆలోచనలు అభిప్రాయాలు వినటానికి కుతూహల పడాలి. జ్ఞానాన్ని ఇచ్చి పుచ్చుకోవాలంటే తెలిసింది తెలుపు, ఇతరులు చెప్పేది విను, వారి మాటలు వినటం ఇష్టమున్నట్లు వర్తించాలి. అవి వినసొంపుగా లేక పోయినా వినటం ధర్మం. అతను ముగించిన అనంతరం ఇష్టమైన సంగతిని గురించి నీవు మాట్లాడు.

సంభాషణ అంటే ఒకరు నొకరు గౌరవించుకోవటం-సమాన ప్రతిపత్తి చూపటం. ఇతరుల యెడ మర్యాదగా ప్రవర్తించడం అభివృద్ధికి మంచి మార్గం. ఇతరులతో సంభాషించేటప్పుడే మనిషి సంస్కారం కనిపించేది.

56