పుట:మాటా మన్నన.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాట్లాడేవారు సర్వము తమకే తెలుసని దృష్టితో మాట్లాడుతుంటే, వినేవారు బుద్ధిహీనులని దృష్టితో వినటానికి అంగీకరించరు. మాట్లాడటం ముగించిన తరువాత అది నా అభిప్రాయం ఇది నీ కెంత నచ్చుతుంది అనాలి వివేక వంతుడు. అంతేకాని తాను చెప్పిందే సరని, తాను చెప్పిందంతా అంగీకరించనివారు మూర్ఖులని తలచరాదు.

సంభాషణలో మరొకదోషం స్వోత్కర్ష , ఆత్మస్తుతి, పరనింద ఎప్పుడూ పనికిరాదు. కొందరు పరోక్ష పద్దతిని స్వోత్కర్ష ప్రారంభిస్తారు. సంభాషణలో ఇవన్నీ తప్పులే.

మరొకదోపం, ఒకరు మాట్లాడుతుంటే ఆ మనిషిని సాంతం మాట్లాడనీక తనకు ఇష్టం లేనపుడు ఎదుర్కొంటారు; వ్యతిరేకిస్తారు. చివరివరకు వినే ఓర్పు లేకపోవటం మంచి పద్ధతికాదు. ఓర్పు, సహనం ఉండాలి. ఒకరు మాట్లాడిన తరువాత మరొకరు మాట్లాడటం సభ్యత.

సంభాషణలో మొదటి సంగతి మర్యాదగా ప్రవర్తించటం. ఎదటిమనిషి. మాట్లాడుతుంటే వినటం ధర్మం. అది ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినాసరే ఇతరుల మనస్సుకు కష్టం కలిగేటట్లు సంచరించరాదు. మన్నన పొందాలంటే సంభాషణలోగాని, వాదనలోగాని మర్యాదగా మాట్లాడాలి. అప్పుడు ఆ మాటలు అందరూ హర్షంతో వింటారు. ఇతరుల అభిప్రాయాలను ఖండించ దలచు కుంటే పెద్ద గొంతుతోను, కోపంతోనూ మాట్లాడరాదు. సకారణంగానూ, శాంతంగానూ మాట్లాడుతుంటే అందరూ బాగా వింటారు.

55