పుట:మాటా మన్నన.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దగ్గరకు వెళ్ళినప్పుడు వారు మనలను హర్షింప జేయలేరు. వారుకూడా బిడియపడిమాట్లాడటానికి జంకుతారు. ఇదంతా చూచి సాధారణ వ్యక్తి కొంచం తృప్తిపడవచ్చు. సంభాషణలో శ్రద్ధ తీసుకుంటే తెలివిగలవారికంటే అధికముగా మాట్లాడగలరు.

సిగ్గు, మౌనం సంభాషణలో పాల్గొన ఇష్టంలేకుండా ఉండటం, ఎంత చెడ్డదో రెండవవారికి అవకాశం ఇవ్వకుండా ఎప్పుడూ తానే చెవికోసిన నక్క మాదిరి మాట్లాడటం అంతకంటే చెడ్డది. ఆ వినే వ్యక్తి ఈ మాటలపోగు నాకు ఎక్కడ దాపురించాడురా! అని అనుకుంటాడు. ఇది సాధారణంగా జరిగే పద్దతి.

లోకంలో అతిగా మాట్లాడేవారు, నోరు మెదపని వారు అధికంగా ఉన్నారు. సక్రమంగా సంభాషణ చేసే వారు స్వల్పం. కనుక ఈ రెండు చెడ్డ గుణాల నుండి తప్పించుకుని బాగా మాట్లాడటం నేర్చుకోవాలి. అతిగా మాట్లాడేవారు అవతలవారు తన మాటలు వినటానికి ఇష్టంగా ఉన్నారో లేదో, వారి ముఖాలు పరీక్షించాలి. కనుక అతిగా మాట్లాడే మనిషి జాగ్రతవహించి, అవతల మనిషికి కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి.

లోకంలో గొప్ప అనుభవజ్ఞులు అతి తెలివి తేటలు గలవారు ఈ విషయమై గుర్తుంచుకోవాలి. ఎప్పుడూ తన సొద చెప్పుకునేవారి మాటలు ఎవరూ వినరు. వారికి మర్యాద మన్నన తగ్గుతుంది.

54