పుట:మాటా మన్నన.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నెగ్గటం మనం కళ్లారా చూస్తున్నాం . సంభాషణలో నేర్పరత్వం లేనిది ఎవరూ ఎందులోను నెగ్గలేరు.

సంభాషించేటప్పుడు మన ధోరణిలో మనం ఉండరాదు. మన మాటలను వారు ఎట్లా స్వీకరిస్తున్నారో గ్రహించాలి. అవతల వారితో మాట్లాడేటప్పుడు వారి అభిమానాలు, అయిష్టాలు గుర్తించాలి. వారి ముఖ కవళికను గమనించాలి. మన మాటలు వారిమీద ఎట్లాపనిచేస్తున్నవో కని పెట్టవలసి ఉన్నది.

ఎవరైనా రాగానే ఎందుకు వచ్చారో గ్రహించి, అందుకు తగినట్లు మాట్లాడాలి.

వచ్చినవా రందరితోనూ ఒకే మాదిరిగా మాట్లాడరాదు. వారి వారి స్థాయిని గుర్తించి వ్యవహరించాలి.

మనస్తత్వ శాస్త్రజ్ఞుడే మంచి సంభాషణకర్త కాగలడు. ఆ శాస్త్రం చదవాలని కాదు; అనుభవం ద్వారా గ్రహించాలి.

సాంఘిక జీవితంలో సంభాషణ నిత్యావసరం. మాట్లాడుతూ ఉంటే, చూస్తూ నోరు మెదపకుండా ఉండేవారు అగౌరవం పొందుతారు. అతను ఒంటరితనం అనుభవిస్తాడు. మానవుడు సంఘజీవి కనుక సంభాషణ చక్కగా చేయవలసిన అవసరం అధికం. అతడు సాంఘికంగా జయం గాంచాలంటే చక్కని సంభాషణకర్తయి ఉండాలి.

విందులకు వినోదాలకుగాని నలుగురు కలిసిఉన్నప్పుడు గాని మౌనవ్రతం పూనితే ప్రయోజనం శూన్యం. కలసి మెలసి చక్కగా మాట్లాడాలి. అందరితో అప్పుడు మైత్రి

9