పుట:మాటా మన్నన.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏర్పడుతుంది. సంభాషణద్వారా ఆకర్షించాలి, అకర్షింప బడాలి. నాలుగు సంగతులు తెలియాలన్నప్పుడు నలుగురుతో మెలగాలి.

చక్కగా సంభాషించగలవారికి జీవితంలో కావలసింది ఏమిటి ? వారు పొందే ఆనందం అనితరలభ్యం.

సంభాషణకర్త లందరు ఒక శ్రేణికిచెందిన వారు కారు. సంభాషణా సంబంధమైన పుస్తకాలు చదివినవారు కొందరు, బాగా చదువుకొన్న వారు కొందరు, ఇంకా గొప్ప సంస్కారం గలవారితో మెలిగి నేర్చుకున్న వారు మరికొందరు. మొత్తంమీద వీరంతా సంభాషణను గుర్తించిన వారే. సంభాషణా ప్రయోజన ప్రాముఖ్యాలను గుర్తించకపోతే మన సంభాషణ రాణించదు.

సంబాషించే నేర్పుగలవారికి సంస్కృతి గలవారి సరసన కూర్చునే యోగ్యత కలుగుతుంది. నేర్పుగా సంభాషించేవారు కొద్దో గొప్పో మానవ ఆలోచన (thought) అభివృద్ధికి ఆధారభూతులు.

మంచి సంభాషణకర్తలు సాంఘికంగా రాణిస్తారు. సంభాషణద్వారా తెలివితేటలు పొందుతారు. సాంఘిక గౌరవం పెరుగుతుంది. నలుగురితో మాట్లాడితే గాని భిన్న దృక్పధాలు మనకు తెలియవు. మంచి ఉద్దేశాలు మనకు కలగవు.

మాట్లాడేటప్పుడు సమయాన్ని గుర్తెరిగి మాట్లాడాలి. వారు ఏస్థితిలో వున్నారు, ఏదైనా దీర్ఘాలోచనానిమగ్నులై వున్నారా, లేక కులాసాగా మాట్లాడుకుంటున్నారా అని.

10