పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

79

మన్నారుదాసునికాంత లతనివైఖరి నెఱంగి కలవరపడుట

క.

మన్నరుదాసుని పలుకులుఁ
గన్నియ లందఱును వినుచుఁ గలకల నగుచున్
సన్నల సైగల నప్పుడు
[1]వన్నెగ నిట్లనిరి చతురవైఖరి మీరన్.

20


సీ.

ఎలనాగ! చూచితే యీవిభు మోహంబు
        వెలఁది! చూచితినమ్మ వింతగాను
నళినాక్షి! వింటివా నాథుని పలుకులు
        నతివ! వింటిఁగదమ్మ యందముగనె
ఆటపాటలచేత నందచందంబుల
        మనకన్న నెక్కుడా మగువ! వినవె
యింతులపొందు దా నెరుఁగని యందానఁ
        జిత్త మాయింతిపైఁ జేర్చె నమ్మ!


తే.

వలచువారలు లేరొ యీవసుధలోన
యింత తమి గల్గ వింటి మే యిందువదన!
యనుచుఁ దమలోన గుసగుసలాడుకొనుచు
విజయరాఘవుఁ గనుఁగొని వేడ్క ననిరి.

21


సీ.

ముదమున నే వచ్చి ముద్దుబెట్టు మనంగ
        ముద్దువెట్ట వదేర మోహనాంగ!
సంతసంబున వచ్చి సరసంబు లాడిన
        సరస మేలాడవు జాణరాయ!
మచ్చికతో వచ్చి మడుపు కొర్కిచ్చిన
        మడు పందుకోవేమి మన్నెరాయ!
నెనరుతో నే వచ్చి నిను గౌఁగిలించిన
        గౌఁగిలింప వదేమి కంతురూప!


తే.

యెవ్వతె దలంచినా విప్పు డెమ్మెకాఁడ!
యానతియ్యర నాసామి! యందముగనె
యనుచుఁ దను జేరి పలుకంగ నబ్జముఖులు
కాంతిమతిమీఁద నెలకొన్న కాంక్ష నుండె.

22
  1. వెన్నగ. క. వన్నెగ