పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

49


చ.

మలయుచు ధాత్రి నింద్రుఁ డగు మన్నరుదాసునిఁ జూచి ప్రేమచే
వలచినయట్టి కాంతిమతి వైఖరిఁ జూత మటంచు నెమ్మదిన్
జెలఁగెడు వేడ్కచే యువతిచెల్వము మెచ్చుచుఁ జూచుచుండు నా
బలరిపునేత్రపఙ్క్తు లన భాసిలెఁ దారక లంబరంబునన్.

105


చ.

విరహిజనంబుమీఁద ననవిల్తుఁడు దాడిజనంగ దిక్పతుల్
పరువడిఁ జల్లు పూవు లన భాసిలెఁ జుక్కలు లెక్కమీరఁగా
సరసకళాకలాపమునఁ జంద్రుఁడు తజ్జయశంసిపల్లవ
స్ఫురదురుపూర్ణకుంభ మనఁ బొల్చెను బూర్వమహీధరంబునన్.

106


మ.

పొగడన్ మించిన చుక్కచాలు తొగగుంపుల్ పెంపుగాఁ గాంచు న
[1]గ్గగనానంతసరోవరంబునడుమన్ [2]గన్పట్టుచున్ జంద్రుఁ డం
శుగుణస్తంభసహస్రమంటపఘనస్పూర్తిన్ సుధారమ్యుఁడై
[3]తగఁ దల్లాంఛనమందు నుండు [4]హరిచందం బందె సాంద్రద్యుతిన్.

107


క.

హేమారవిందమందిర
భామాకుచకుంభయుగళపత్రలతాంక
స్తోమకర! సకలభువన
క్షేమంకరసత్ప్రకాశ! చెంగమలేశా!

108


స్రగ్విణి.

సమ్యగర్చాసదాసక్తభక్తావళీ
కామ్యదానక్రియాకల్పభూమీరుహా!
సౌమ్యనానాబుధస్తవ్యదీవ్యద్గుణా!
రమ్యనీలాలకా! రాజగోపాలకా!

109


క.

గోభిలమౌనీంద్రనుత
ప్రాభవ! భవపంకజాతభవహృత్పద్మా!
సౌభద్రేయతనూభవ
శోభనకరపాదపద్మ! సుస్థిరపద్మా!

110
  1. గ్గగనాంతసరోవరంబు
  2. గనుపట్టుచుఁన్
  3. తగెలల్లాంఛన
  4. హరిచందంబంది సాంద్రద్యుతిన్