పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[iv]

మరలుట, కాంతిమతి స్వప్నమున విజయరాఘవునితోఁ గలిసి మేల్కని మోహపరవశయై పరితపించుట, చెలులు కాంతిమతికి శైత్యోపచారములఁ జేయుట, వనకేళి, జలకేళి, మన్మథారాధనాదులు ద్వితీయాశ్వాసమునఁ బ్రతిపాద్యములు.

కాంతిమతియొక్క మాన్మథప్రలాపములు, విలాసవతియను చెలి కాంతిమతియొక్క స్థితిని గని కారణం బడుగుట, విలాసవతి విషయముల నన్నియు నెఱింగి విజయరాఘవుఁ గూర్ప సమ్మతించుట, విజయరాఘవునొద్దకు విలాసవతి బయలుదేరి యతనికిఁ గాంతిమతీసౌందర్యాతిశయచాతుర్యాదులఁ దెలియఁజేసి యామెను బెండ్లియాడుటకు నాతని సమ్మతింపఁ జేసి మరలివచ్చి కాంతిమతికి జరిగిన వృత్తాంతముల నెల్ల నెఱింగించుట, కాంతిమతి యామె సామర్థ్యమునకు మెచ్చుకొనుట, ఇత్యాదులు తృతీయాశ్వాసప్రతిపాద్యములు.

విజయరాఘవుఁడు మన్మథబాణవిద్ధుఁ డై పరితపించుట, యతని కాంతలు కలవరపడుట, విషయము నెఱింగిన శ్రీనివాసతాతయాచార్యులు విజయరాఘవుని సమాశ్వాసపరచి, వివాహనిశ్చయార్థము రాజచంద్రుని గాంచి వివాహము నిశ్చయించుట, యావార్తను విజయరాఘవున కెరుకసేయ నతఁ డానందించుట యిత్యాదులు చతుర్థాశ్వాసమునఁ బ్రతిపాదితములు.

పంచమాశ్వాసమునఁ గాంతిమతీవిజయరాఘవుల వైవాహిక వైభవము, సంయోగవియోగశృంగారవర్ణనయు, కాతిమతితోఁ గూడి విజయరాఘవుఁడు తంజాపురమున కేతెంచి సుఖంబున నుండుట మొదలగునవి వర్ణితములు.

విచిత్ర కథ

[1]మద్రాసు ప్రాచ్యలిఖితపుస్తకభాండాగారమున “అల్లాడ విజయభూపతి సింహవిలాసము" అను నొక ప్రబంధ మున్నది. అయ్యది రాచవీటి నరపతి పుత్రిక యగు సౌందరీదేవిచే రచింపఁబడియున్నది. తల్లి పేరు మౌక్తికాంబ. సౌందరీ దేవి తనభర్త యగు అల్లాడ విజయభూపతిసింహుని శృంగారచరిత్రమును వర్ణింపుచు వ్రాసిన ప్రబంధ మిది. కాని విజయరాఘవుని చరిత్రను వర్ణింపుచు రంగాజమ్మచే వ్రాయఁబడిన యీ మన్నారుదాసవిలాసప్రబంధమునే కర్త పేరు

  1. See the Descriptive catalogue of the Telugu Manuscripts in the Govt. Oriental Mss. Library, Madras, Vol. I. Prabandhas — Srngaraprabandbas (Part II) Page No. 1040 Ms. No. 786. It is understood that the above Ms. was transfered to the Sri Venkateswara University Oriental institute, Tirupathi.