పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(iii)

లలో వ్రాయఁబడినవియే. మొదటిది (D. 213) M. 245 సంఖ్యగల యది గ్రంథలిపిలో వ్రాయఁబడియున్నది. రెండవది (D. 214) M. 246 సంఖ్యగల యది తెలుఁగులిపిలో వ్రాయఁబడియున్నది. మొదటిదానిలో 287 ఆకులును, రెండవదానిలో 128 ఆకులును గలవు. పంచమాశ్వాసపు అసంపూర్ణమైన 118-వ పద్యముతో 248 సంఖ్యగల తెలుఁగులిపి గ్రంథము నిలిచిపోయినది. అద్దానికి దర్వాతిభాగము కొంతవఱకు 245 సంఖ్యగల గ్రంథలిపి గ్రంథమున లభించుచున్నది. కడకు పంచమాశ్వాస మసంపూర్ణముగనే యున్నది. అయినను స్వల్పభాగముమాత్రమే పంచమాశ్వాసమున లోపించినది. ఇంచుమించు గ్రంథభాగ మంతయు నున్నట్లే గ్రంథస్థితిని జూచిన దోఁచగలదు. ఈ రెండుమాతృకలను బరిశీలించి చూడ గ్రంథలిపిని వ్రాయఁబడియున్న మాతృక చాలప్రాచీనమైనదిగను జాలవఱకు శుద్ధమైనదిగను నుండుటచే నీ రెండుమాతృకలలోను గ్రంథలిపి మాతృక మూలగ్రంథ మగు నని చెప్పవచ్చును. రెండుగ్రంథముల పరిశీలనానంతర మే యీ ముద్రణము జరిగినది. గ్రంథలిపిలో వ్రాయఁబడియున్న గ్రంథము “క” గ్రంథముగాఁ బరిగణింపఁబడియున్నది. కొంతవఱకు శుద్ధముగను మంచిస్థితిలోను నున్నందున తెలుఁగులిపి మాతృక యీ ముద్రణమునఁ బ్రధానగ్రంథముగా స్వీకరింపఁబడియున్నది. ప్రధానగ్రంథమందలి పాఠములను దిద్దుపట్ల యథామాతృకాపాఠములు క్రింద (Foot Note) "క" గ్రంథపు పాఠములతోఁగూడ నివ్వబడియున్నవి. దొరకుచున్నట్టి రంగాజమ్మ కృతులలో నీ మన్నారుదాసవిలాసము కట్టకడపట ముద్రింపఁబడున దైనను నామెచే మొట్ట మొదట రచింపఁబడిన దీగ్రంథమే యనుట విజ్ఞలోక మెఱిఁగినదే.

ప్రతిపాద్యము

ప్రబంధ రూపమునఁ దన చరిత్రమును వర్ణింపుచు శ్రీ రాజగోపాలస్వామియొక్క ఫాల్గుణోత్సవమును గూడ నందు వర్ణింపు మను విజయరాఘవనాయకుని కోర్కెయే రంగాజమ్మయొక్క యీ కృతికి మూలము. తంజాపురాంధ్రనాయకరాజుల పరంపరలో వచ్చిన విజయరాఘవనాయకుఁడు సకల రాజ్యభోగములతో విలసిల్లుచు నిలవేల్పును జంపకవననేతయు నగు శ్రీరాజగోపాలస్వామికి ఫాల్గుణోత్సవమును జేయ సంకల్పించుట ప్రథమాశ్వాసమునఁ బ్రతిపాద్యము.

శ్రీరాజగోపాలస్వామియొక్క ఫాల్గుణోత్సవనిర్వహణార్థము విజయరాఘవనాయకుఁడు బయలుదేరుట, వసంతాగమనము, ఫాల్గుణోత్సవవర్ణనము, తదవసరమున రాజచంద్రుని పుత్రిక యగు కాంతిమతి సౌధాగ్రసీమనుండి శ్రీరాజగోపాలుని సేవించి చక్కనిపతిని గోరుట, కాంతిమతి విజయరాఘవుని చక్కదనమును జూచి మోహించుట, విజయరాఘవుఁడు పరివారముతో నిజనివాసమునకు