పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(ii)

రంగాజమ్మ

విజయరాఘవనాయకుని యాస్థానమంటపమునఁ బేర్కొనఁదగిన స్థానము నాక్రమించిన విదుషీమణులలో రంగాజమ్మ చాలముఖ్యురా లని చెప్పవలసియున్నది. తంజావూరులో మొట్టమొదటిసారిగా విజయరాఘవనాయకునిచేతనే కనకాభిషేకముఁ గొన్న యాంధ్రవిదుషీరత్నముగదా! రంగాజమ్మ. బహుభాషాకోవిదయు విదుషీమణియుఁ గవయిత్రియు నగు రంగాజమ్మ, కృతులను గుఱించియు, నాస్థానమున నామె స్థానమును గుఱించియు, విజయరాఘవనాయకునికి నామెకును గల సంబంధమును గుఱించియు విపులముగా [1]“ఉషాపరిణయము" అను గ్రంథము యొక్క యుపోద్ఘాతమునఁ జర్చించఁబడియున్నది. మరల నవి యన్నియు నిట బేర్కొనుట చర్వితచర్వణమే కాఁగలదు.

మన్నారుదాసవిలాసము

మన్నారుదాసవిలాస మను మఱియొకగ్రంథముకూడ యక్షగానరూపమున నీరంగాజమ్మచేతనే విరచింపఁబడియున్నది. ఆ గ్రంథము కాకినాడ ఆంధ్రసాహిత్యపరిషత్తు వారిచే 1927 వ సంవత్సరమునఁ బ్రచురింపఁబడియున్నది. గ్రంథము యొక్క మఱియొకతాళపత్రప్రతియే యిది యగు నను భ్రమతో సవివరణసూచీపత్రమున నీ గ్రంథముకూడ ముద్రితగ్రంథముల కోవలోఁ జేర్చఁబడియున్నది[2]. కాని పరిశీలనానంతర మిది యముద్రిత మని తేలినది. తంజాపురాధీశుఁ డైన విజయరాఘవనాయకునికి మన్నారుదాసుఁ డనియు మఱియొకపేరు ప్రసిద్ధి యైనది. మన్నారుగుడి క్షేత్రమున వెలయు శ్రీ రాజగోపాలస్వామిభక్తుఁ డగుటయు నాతని యనుగ్రహవిశేషబలమున నితఁడు జన్మించుటయు నీ ప్రసిద్ధికి కారణము లైనవి. అతని చరిత్ర యే యిందుఁ బ్రధానకథావస్తు వగుటకతన నిది “మన్నారుదాసవిలాస"మని పేర్కొనఁబడియున్నది.

మాతృకలు

ఈ 'మన్నారుదాసవిలాస' ప్రబంధమునకు తంజావూరు సరస్వతీమహల్ గ్రంథాలయమున రెండు మాతృకలు గలవు. రెండు మాతృకలును దాటియాకు

  1. రంగాజమ్మకృతి యైన యీయుషాపరిణయప్రబంధము తంజావూరు సరస్వతీమహల్ గ్రంథాలయమువారిచే 1965-వ సంవత్సరమునఁ బ్రచురించఁబడియున్నది. పరిష్కర్త - శ్రీ విఠలదేవుని సుందరశర్మ.
  2. See the Descriptive catalogue of the Telugu. Manuscripts in the T. M. S. S. M. Library, Tanjore. Vol. 1. No. 213 and 214; Published by Andhra University in the year 1938.