పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భూమిక

తంజావూరు సరస్వతీమహల్ గ్రంథాలయమునుండి ప్రచురింపఁబడుచున్న యాంధ్రగ్రంథములలో నీ మన్నారుదాసవిలాసముకూడ నొకటి యగును. దక్షిణాంధ్రభాషావికాసమునకు సంబంధించినంతవఱకు తంజాపురాంధ్రనాయకరాజయుగము పెద్దగఁ బేరుప్రఖ్యాతుల నార్జించుకొన్నది. ఆంధ్రసారస్వతచరిత్రలోనే తంజాపురాంధ్రవాఙ్మయ మొక ప్రత్యేకవిభాగ మై నాటి సారస్వతోద్యమప్రత్యేకతను దిగంతములకుఁ జాటున దై యుండుట సారస్వతోపాసకు లందఱకును దెలిసిన విషయమే. ప్రబంధములు, ద్విపదలు, యక్షగానములు, పదములు, కీర్తనము లిత్యాది సకలవిభాగములలో నానాఁడు వెల్లివిరిసిన యాంధ్రకవిపండితుల ప్రతిభ తరతరాలకు మార్గదర్శక మైనది. విజయనగరమునఁ గృష్ణదేవరాయలవలె తంజావూరులో రఘునాథనాయకుఁడు (1614-1633) సంస్కృతాంధ్రసారస్వతపోషకుఁడుగాఁ బ్రసిద్ధిఁ గాంచెను. సారస్వతసాధనలోను సారస్వతోపాసకుల గౌరవించుటలోను రఘునాథుఁ డపరభోజుఁ డని విఖ్యాతి నందుకొనెను.

రఘునాథనాయకుని తర్వాత నతని కుమారుం డైన విజయరాఘవనాయకుఁడు (1633-1673) దక్షిణాంధ్రనాయకరాజ్యసింహాసనము నధిష్ఠించి యనుస్యూతముగ సారస్వతోద్యమమును సాగించెను. అతని లేఖినికూడ కొన్ని యపూర్వగ్రంథములను సృజించినది. అవి యన్నియు 17-వ శతాబ్దపు సారస్వతోద్యమచిహ్నములుగా నేటికిని మనముం దున్నవి. కామరుసు వెంకటపతి సోమయాజి, చెంగల్వ కాళకవి మొదలయిన యుద్దండకవిపండితులతో నిండియుండిన దీతని యాస్థానము. ఆనాఁడు తెలుఁగుతల్లి తంజావూరులో నింతింతనరాని గౌరవమును బొందిన దనుట సత్యదూరము కాదు.

రఘునాథవిజయరాఘవనాయకుల యాస్థానములలోని విశేష మేమన వనితారత్నములుగూడ నాస్థానకవయిత్రులుగా నట స్థానమును వహించుటయే. రఘునాథనాయకుని కాలమున రామభద్రాంబ, మధురవాణి మొదలగు స్త్రీరత్నము లాస్థానకవయిత్రులుగా వెలసి రనుట రంగాజమ్మ యొక్క యీ క్రిందిపద్యమువలన స్పష్ట మగుచున్నది.


తే. గీ.

అయ్య(దినముల) రామభద్రమ్మ మధుర
వాణికాంబయు సరసగీర్వాణభాష
నిట్టి కృతులను రచియించి యిలను గీర్తిఁ
జాలఁ గాంచిరి సుకవులు సన్నుతింప.

(మన్నారుదాసవిలాసము ప్ర. ఆ. ప-18.)