పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

89


యొడ్డాణంబును, జంట లగు గంటలమొలనూలును, చరణారవిందంబులకు
నందబు లైన యందియలును, మొదలుగాఁగల యాభరణంబులు ధరించి
సకలజనస్తోత్రపాత్రం బైన వేత్రంబుఁ గెంగేలఁ గీలించి, హేమారవిందేం
దిరారుక్మిణీసత్యభామలతోడఁ గూడఁ జిరత్నరత్నప్రభాకలితహేమసింహా
సనమధ్యంబున నధ్యాసీనుండై, యవక్రగతిక్రమబులు గల చక్రంబులను,
కుందనపుందీఁగెపనివ్రాఁతలఁ జొక్కంబు లగు చందురగావిటెక్కెంబులను,
దట్టంబు లగు కాంచనపట్టంబులను, ఫలభారసంభృతంబు లగు శాతకుంభరం
భాస్తంభంబులను, చతుర్ద్వారసందానితనారంగజంబీరనాళికేరాదిఫలవితానం
బులను, హేమమయంబు లైన నానావిధకుసుమధామంబులను, పురోభాగ
కల్పితానల్పప్రమాణరంగత్తురంగంబులను, దారుకారచితసారథ్యంబునను,
ప్రాంచితం బైన కాంచనకలశంబునను తదగ్రంబున నవరత్నమాలికావి
చిత్రం బగు కాంచనఛత్రంబునను తీరుమీరిన విజయచక్రంబను తిరుతేరున
వేంచేసి తరలివచ్చు సమయంబున, నవ్విజయరాఘవమహీవిభుండును జల
కంబులాడి చలువదుప్పటులఁ దడియొత్తి, క్షౌమాంబరంబులు ధరించి,
సర్వాభరణభూషితుండై నేమంబుమీర నామతీర్థంబై, గొప్ప సుప్పాణి
[1]ముత్తె(ము)లజపసరంబుఁ గెంగేలం బూని మౌనవ్రతంబున [2]మన్ననారు(ల)
పదధ్యానంబు సేయుచుఁ జెలువుమీరఁ జెంతలఁ గులకాంతలు గొలువఁ
దనమనోరథంబు నెఱ వేర్చు [3]విజయచక్రంబను రథంబుపైఁ జెంగమలాంబా
సమేతుండై యున్న మన్ననారును గన్నులపండువుగా గాంచి దండప్రణా
మంబు లాచరించి, ప్రాంజలియై, కటాక్షవీక్షణంబుల నిజరక్షణోన్ముఖుం
డైన యాచండలంకారునకు నభిముఖుండై నడచుచు, సకలాభీష్టసాధ
కంబైన యష్టాక్షరీమంత్రజపంబు గావింపుచు, మందమందయానంబున
నందంబుగా వచ్చు నవసరంబున, నాగోపాలదేవుండును ధేనువత్సన్యాయం
బున నిజదాసుండైన విజయరాఘవుమీది వాత్సల్యంబున శీఘ్రగమనంబున
రథముఁ దరలింపుచుఁ దిరువీథుల వేంచేయునప్పుడు, నానాదేశంబులనుండి
తండోపతండంబులుగా వచ్చిన ప్రజలు దండప్రణామంబు లాచరింపుచు
లోచనోత్సవంబుగా సేవింపుచు నుండువేళ, నందు గొంద ఱాజనులకుఁ
బొడమిన బడలికలు దీర వ్యజనంబుల విసరువారును, చందనకుసుమాదులు,
చలువతీర్థంబులు, జంబీరరసవాసితంబు లగు నీరుమజ్జిగలును, చొక్కం బగు
చక్కెరపానకంబును, మిక్కిలి యలర సొంటిచక్కెరలును, అక్కడక్కడ
నెక్కుడుగ సమర్పించువారును, మఱియును గొందఱు భద్రప్రదం బగు

  1. ముత్తెలజపసరంబుఁ గెంగేల. క. ముత్తెలజపసరంబుఁ గేల.
  2. మన్ననారు. క. మన్ననారుల.
  3. విజయచక్రంబును. క. విజయచక్రంబను.