పుట:మధుర గీతికలు.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ఊఁగుటుయ్యలలోనఁ బన్నుండఁ బెట్టి
హాళి ‘నుయ్యాలొ జంపాలో' యనుచు నూపి
నిన్ను జోకొట్టి హాయిగా నిదురఁబుచ్చు
తల్లి ఋణమును దీర్ప నీతరమె వత్స?

తప్పుటడుగుల నిడి నీవు తారినపుడు
వచ్చియును రాని నుడువులు పలికినపుడు
విద్దెములు నేర్పి, పలుకులు దిద్దినట్టి
తల్లిఋణమును దీర్ప నీతరమె వత్స ?

నీదు తనుధూళి తనమేనినిండ సోఁక
నిండు బిగియారుకౌఁగిట నిన్ను బొదివి
మురిపమున నిన్ను నిరతంబు ముద్దులాడు
తల్లి ఋణమును దీర్ఘ నీతరమె వత్స ?

నీకు నేదైన రోగంబు సోఁకెనేని
కంటవత్తిడుకొని చెంత కాచియుండి
సతత ముపచారములుచేసి సాఁగుచుండు
తల్లి ఋణమును దీర్ఘ నీతరమె వత్స ?

4