పుట:మధుర గీతికలు.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తల్లి


కాంక్ష నవమాసములు మోసి కష్టమొంది
నిన్ను గని పెంచి పెద్దవానిగ నొనర్చి
మమత లాలించి పాలించి మనిచినట్టి
తల్లి ఋణమును దీర్ప నీతరమె వత్స?

గర్భవాసాన నీ వున్న కాలమందు
నిన్ను భరియించి సైరించి, యెన్నరాని
దారుణం బగు ప్రసవవేదనలఁ బడిన
తల్లి ఋణమును దీర్ఘ నీతరమె వత్స?

ఆకలికిఁ దూలి నీ వేడ్చినప్పు డెల్ల
మక్కువను నిన్ను పైకెత్తి ఎక్కు జేర్చి
కడుపు నిండఁగ స్తన్యంబు గుడిపినట్టి
తల్లి ఋణమును దీర్ప నీతరమె వత్స ?