పుట:మధుర గీతికలు.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ధర్మములు నేను బోధించుతరిని, మీకు
గురుఁడ నగుదును కావున ధరణినాధ :
అంతతడవును నే నున్నతాసనమున
నుండ, నేలపై మీరు కూర్చుండవలయు.”

భటునివాక్యము లాలించి, వల్లె యంచు
అధిపుఁ డాతని తనదు సింహాసనంబు
మీఁద కూర్చుండఁగా నియమించి, తాను
క్రింద కూర్చుండె, సభ్యులు ఱిచ్చవడఁగ.

ఠీవిగా నట్లు కూర్చుండి సేవకుండు
భటునొకని పిల్చి, యొక గాజు పాత్రలోన
పాలు పోయించి, “అయ్య! ఈపాలయందు
వెన్న యున్నద ?" అనుచు భూవిభుని నడిగె.

'ఉన్న' దని రాజు వచియించి మిన్నకుండె;
'ఎచట నున్నది ?' యని తోనె, భృత్యుఁ డడిగె;
'అంతటను నిండియున్నది' యనుచు ఱేఁడు
బదులు పలుకఁగ, నీరీతిఁ బలికె భటుఁడు.

42