పుట:మధుర గీతికలు.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


అంత నాతనియఱపుల నాలకించి,
పరుగుపరుగున పొరుగువా రరుగుదెంచి
“ఏల యేడ్చెద వీలీల నేలఁ బొరలి ?”
అనుచు ప్రశ్నింప, నీరీతిఁ బనవె నతఁడు.

“ఏమి చెప్పుదు ? ముప్పదియేండ్లనుండి
కూడఁబెట్టిన ధన మెల్ల గోతిలోన
దాఁచియుంచితి, నెవ్వఁడో తస్కరుండు
పచ్చపైకంబు మునుముట్ట మ్రుచ్చిలించె.

“అనుదినంబును నిచ్చటి కరుగుదెంచి
కాంచనంబును కాంక్షమై కాంచుచుందు;
ఏమి చేయుదు నక్కటా ! యింకమీద?"
అంచు ముదుసలి కన్నీరు నించి చెప్పె.

అనుడు, నా మాటలకు వార లనిరి యిట్లు
“పరుల కీయవు, కుడువవు, పైఁడి నీకు
ఏమిలాభంబు చేకూర్చె నింతదనుక ?
అకట! ఉండిన నూడిన నొకటి కాదె.

20