పుట:మధుర గీతికలు.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



అనుచు నిరీతిఁ దలపోసి యాతఁ డెట్లొ
తుదకు నిదురించె; వానిని వెదకికొనుచు
వచ్చి నిలిచె తటాలున వైరివీరుఁ
డొక్కరుఁడు వాఁడు నిద్రించుచున్నయెడకు.

ఏమిచిత్రమొ అంతలో చీమ యొకటి
కఱచె రాజకుమారుని కరతలంబు;
ఉలికిపడి లేచి యాతండు తెలివి నొంది
కాంచె వెసఁ దన్ను జంప నుంకించు వైరి.

కని, జరీలున నొఱనుండి కత్తి దూసి
ఒక్కవ్రేటున పగతుని నుక్కడంచి
కడమశత్రులు తనపైని పడకమున్నె
గంతుగొని దాఁగె నాచెంత గహ్వరమున.

తరణి గ్రుంకిడె; నంత శాత్రవులు రాత్రి
రాకుమారుని కనుఁగొనఁ లేక విసిగి,
ఉదయమున లేచి యటునిటు వెదకి వెదకి
చేరి నిలిచిరి గహ్వరద్వారముకడ.

4