పుట:మధుర గీతికలు.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



      అందముగ దాని మనయింటియరుగుమీఁద
      చూరుపట్టెలఁ గట్టెద తోరణములు;
      చక్కగా దాని మనమేడ స్తంభమునకు
      వ్రేలఁగట్టెద ధ్వజముగా గాలి కెగుర.

      దానిఁ గొనితెచ్చి మనదొడ్డిలోన నున్న
      తాడిచెట్టులనడుమ వ్రేలాడఁగట్టి
      లీలమై దాని తూఁగుటుయ్యాలఁ జేసి
      ఓలలాడుచు నుందు నే హొయలు మీఱ.

తల్లి. ఎట్టెటూ: ఏమి యంటివి? ఇట్టు రావె,
      ఇన్ని వగలెట్లు నేర్చితి వింతలోనె ?
      ఈవు పల్కినయట్టి యా యింద్రధనువు
      పట్టుకొన నీకు శక్యమే చిట్టిపట్టి ?

      పోవుకొలఁదిని నది దవ్వు పోవుచుండు,
      చూచి చూచినయంతలో చోద్య మొప్ప
      మాయమై పోవు, నది వట్టిమాయ సువ్వె;
      చిట్టికూనరో! అది యెట్లు పట్టఁగలవు ?

18