పుట:మధుర గీతికలు.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంద్ర ధనుస్పు



తల్లి. తమ్మిపువ్వునఁ దూఁగాడు తుమ్మెద లన
     చల్ల గాలికి చెదరి నీపిల్లకురులు
     ముద్దునెమ్మోముమీఁద దోబూచులాడ
     పరుగువాఱెద వెచటి కోబాలపాప ?

     చిఱుతచెమ్మటముత్తెముల్ చిందువాఱ
     చెంగుచెంగున పరుగెత్తి చెంగలించి
     ఎచటి కేగెదు బాలుఁడా! యిల్లు విడిచి
     కులుకుఁజూపులు మింటిపై గుమ్మరించి ?

బిడ్డ. అల్లదే యమ్మ : చూచితే యాకసమున
     పంచరంగుల గిలకలబద్ద వోలె
     వింతవన్నెల రతనాలవిల్లు తోఁచె;
     బాళి నేగెద దానిని బట్టుకొనఁగ.

16